
రాయితీ పథకాలతో ఆర్థికాభివృద్ధి
కలెక్టర్ చామకూరి శ్రీధర్
బి.కొత్తకోట: భవిష్యత్ సాగు పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం ఆయన బి.కొత్తకోట మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉద్యాన పంటల సాగు స్థితిగతులపై తెలుసుకునేందుకు స్వయంగా గులాబీ, టమాట సాగు చేస్తున్న పోలాల్లోకి వెళ్లారు. కూలీలతో ముచ్చటించారు. మొదట బీరంగి గ్రామం కర్ణాటక సరిహద్దులో నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద రూ.40 లక్షల పెట్టుబడితో సాగు చేస్తున్న గులాబీతోటను పరిశీలించారు. తోటలో మొక్కలను పరిశీలించి మొగ్గలకు తొడిగిన కవర్లను పరిశీలించారు. తోటనిర్వహణ చూస్తున్న వారితో మాట్లాడారు. గులాబీ పంట దిగుబడితో సంబంధం లేకుండా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పూలను ఎగుమతి చేస్తామని, ధరలు ఆశాజనకంగా ఉంటే ఏడాది పొడవునా పూలను మార్కెటింగ్ చేస్తున్నట్టు కలెక్టర్‌కు వివరించారు. దిగుబడికి సంబంధించి ప్రస్తుతం ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించడంతో పూల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని, దీనికితోడు మార్కెట్ లేకపోవడంతో మొగ్గులను తుంచేస్తున్నామని వివరించారు. ఎగుమతి చేస్తున్న గులాబీకి మంచి మార్కెటింగ్‌తో ఆదాయం లభిస్తుందని చెప్పగా కలెక్టర్ ఇక్కడ పని చేస్తున్న బిహారీ కూలీల జీవనంపై ఆరా తీశారు. అక్కడినుంచి మోడల్ స్కూల్ వద్ద మల్చింగ్‌తో సాగవుతున్న టమాట, మిరప పంటలను కలెక్టర్ పరిశీలించారు.
● జిల్లాలో ఉద్యాన పంటల పెంపకం విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ మోహమ్మద్ అజారుద్దీన్, ఎంపీడీఓ దిలీప్‌కుమార్, ఆర్‌ఐ వీరాంజనేయులు, వీఆర్‌ఓల ఉన్నారు.
● ప్రజల నుంచి పీజీఆర్‌ఎస్‌కు అందే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ చ శ్రీధర్ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అప్పటికప్పుడు వ్యవసాయ, హౌసింగ్, హార్టికల్చర్, సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖలవారీగా వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరణ చేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు చేపట్టాలన్నారు.