
దోపిడీ, దౌర్జన్యాలకు మంత్రి మండిపల్లి తెర
రాయచోటి : మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు రాయచోటి ప్రాంతంలో ఆయన అనుచరులు దోపిడీలు, దౌర్జన్యాలు, అరాచకాలు, దొంగతనాలకు తెరలేపారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం రాత్రి మంత్రి సూచనల మేరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం నిల్వ ఉంచిన కంకర, ఇతర సామగ్రిని దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారని రమేష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో మంత్రి సోదరుడు లక్ష్మీప్రసాద్‌రెడ్డి, మేనల్లుడు మౌర్యారెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి మరికొందరితో కలిసి కుట్రలో భాగంగా జాతీయ రహదారి పనులు నిర్మాణం కోసం నిల్వ ఉంచిన కంకర, ఇతర మెటీరియల్‌ను దొంగతనంగా జేసీబీలతో టిప్పర్లకు పోసి దోపిడీకి యత్నించడం సిగ్గుచేటన్నారు. సమాచారం తెలుసుకుని నిల్వ ప్రాంతానికి చేరుకునేటప్పటికి 15, 20 టిప్పర్లు అప్పటికే తరలించారన్నారు. మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన వస్తువులనే దోపిడీ చేస్తున్నారంటే ఇక సామాన్యుడికి ఎక్కడ రక్షణ ఉంటుందని రమేష్‌రెడ్డి నిలదీశారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు ఎంతటి నీచమైన సంస్కృతితో ముందుకు వెళ్తున్నారో వారు పాల్పడిన దోపిడీని చూస్తే తెలుస్తోందన్నారు. దౌర్జన్యాలు, అరాచకాలే కాకుండా దొంగతనాలకు పాల్పడటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. ఇప్పటికే మట్టి, ఇసుక, కంకర మిషన్ల దగ్గర కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారని ఆరోపించారు. ప్రతి పని దగ్గర టీడీపీ నాయకులు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ రోజు దౌర్జన్యంగా ఎమ్మెల్యేకి చొరబడి డబ్బులు సంపాదించే దిగజారుడుతనానికి దిగారు. మరో పక్క ఎర్రచందనాన్ని మంత్రి అనుచరులు భారీగా తరలించి కోట్ల రూపాయలు గడిస్తున్నారని వివరించారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్నదంటే ఎవరు సిగ్గుతో తలదించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఇదేనా గవర్నర్స్ అంటే కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి వ్యవహారాలను చంద్రబాబునాయుడు ఎంకరేజ్ చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఇంతటి దురదృష్టకరమైన పాలన దౌర్జన్యకరమైన సంఘటన నా రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే పనులను ఎవరైనా టెండర్లలో పాల్గొనవచ్చన్నారు. టెండర్లు దక్కించుకుని పనులు చేసుకుంటుంటే మంత్రి ఇంజినీర్లకు చెప్పి పనులు ప్రారంభం కాకుండా నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. అంతటితో ఆగక పనుల కోసం నిలువ ఉంచిన కంకర, ఇతర సామగ్రిని దోపిడీ చేయించే దౌర్భాగ్య స్థితిలో మంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కంకర, ఇతర సామగ్రిని దోచుకెళ్లడం జిల్లాలో మంత్రి ఆగడాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయన్నారు. ఇంతటి దురదృష్టకరమైన పరిపాలనను ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు. మంత్రి అరాచకలపై చంద్రబాబునాయుడు, లోకేష్‌లు దృష్టి సారించాలన్నారు. లేకుంటే మండిపల్లి దోపిడీ, దౌర్జన్యాలు మీ అనుమతులతోనే జరుగుతున్నాయా అనేది స్పష్టం చేయాలన్నారు. మీరే అనుమతి ఇచ్చినట్లయితే నేరుగా మీకే టాక్స్‌లు కడతామని తెలిపారు. ఎక్కడ ఎవరు అరాచకం చేసిన తాట తీస్తానని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పిన రోజునే ఆయన అనుచరులు దొంగతనాలకు పాల్పడటంపై సమాధానం చెప్పాలన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇద్దరు పోలీసులను పంపారన్నారు. దౌర్జన్యంగా దొంగతనాలు చేస్తున్నారంటే ఇలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వారిపైన తక్షణం చర్యలు తీసుకొని అరాచకాలు ఆపుతారా లేదా వారిని రమేష్‌రెడ్డి డిమాండ చేశారు. 1999లో తాను ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. ఇది ప్రజాస్వామ్యమే కాదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటమిలో ఉంటాయి, ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి రేపు వెళ్తాయన్నారు. ఈ అరాచకాలకు పాల్పడిన వారు ఏ బొక్కలో దాక్కున్న భవిష్యత్తులో బయటకు తెచ్చి ఏం చేయాలో అవి చేస్తామని హెచ్చరించారు. మాకు ప్రభుత్వం వస్తుంది.. మేము అధికారంలోకి వస్తాం.. ఇలాంటి వారి కథ చూస్తాం అని ఘాటుగా స్పందించారు. అంత సులభంగా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చేతులకు గాజులు తొడుక్కొని ఇక్కడ ఎవరూ లేరంటూ హెచ్చరించారు. రామాపురం మండలం హసనాపురం గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి మట్టి అమ్ముతూ ఒక్కొక్క లారీ నుంచి రూ.1200 వసూళ్లు చేస్తున్నట్లు విమర్శించారు. అంతేకాకుండా ఎర్రచందనం తరలించి సంపాదిస్తున్నట్లు చెప్పారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు మేము తీసుకెళ్తున్నామని వినోద్‌కుమార్‌రెడ్డి ఓ సందర్భంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని ప్రశ్నించారు. తాను టీడీపీలో 25 సంవత్సరాలు పనిచేశానన్నారు. ఎన్నికల ముందు నాకు నచ్చక పార్టీ నుంచి బయటికి వచ్చానన్నారు. నా మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడతారా.. కక్ష సాధింపు అంటే దొంగతనాలు చేయడమా అని ఆయన విరుచుకుపడ్డారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అయినా నా ఆస్థికే భద్రత లేదు అంటే సామాన్యుడి ఆస్థికి ఏం భద్రత ఉంటుందో పోలీసు అధికారులు చెప్పాలన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రమేష్‌రెడ్డికి
సంబంధించిన కంకర, సామగ్రి దోపిడీకి యత్నం
మంత్రి అనుచరులను అడ్డుకున్న వైనం
మట్టి, ఇసుక, కంకర, ఎర్రచందనం
అక్రమ రవాణాలో మంత్రి, అతని అనుచరులు దోచుకుంటున్నారు
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అరాచకాలపై మీడియా ముందు మండిపడిన ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి
సీఐకి ఫిర్యాదు
రాయచోటి ఎస్పీ కార్యాలయం సమీపంలో స్టాక్ పాయింట్‌లో నిల్వ ఉంచిన కంకర ఇతర సామగ్రిని దొంగలించుకు వెళ్తుండటంపై మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి రాయచోటి అర్బన సీఐ బివి చలపతికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి రమేష్‌కుమార్‌రెడ్డి నేరుగా అర్బన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి స్వయంగా రాసిన ఫిర్యాదుపత్రాన్ని సీఐకు అందజేశారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దోపిడీకి పాల్పడిన వారి పట్ల చర్యలు తీసుకోవాలని సీఐను కోరారు. అలాగే కంకర ఇతర సామగ్రిని తరలిస్తున్న జేసీబీ, టిప్పర్లను పోలీసులకు స్వాధీనం చేశారు.

దోపిడీ, దౌర్జన్యాలకు మంత్రి మండిపల్లి తెర