విద్యార్థులతో చెడుగుడు! | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో చెడుగుడు!

Apr 12 2025 2:32 AM | Updated on Apr 12 2025 2:32 AM

విద్య

విద్యార్థులతో చెడుగుడు!

బి.కొత్తకోట: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేస్తే..ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోజుకో మౌఖిక ఆదేశాలతో చదువుతో చెడుగుడు ఆడుకుంటోంది. ఈరోజు ఇచ్చిన ఆదేశాలు మరుసటిరోజు ఉండటం లేదు. స్పష్టమైన, సరైన నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వం..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మార్పును సరి చేస్తామంటూ విద్యాశాఖను గందరగోళంలోకి నెట్టేస్తోంది. దీనిపై విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకోవడమేకాక విద్యావ్యవస్థ ఎటు పోతోందని వాపోతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీవో నంబర్‌ 117 ద్వారా ప్రాథమిక పాఠశాల్లోని 3,4,5 తరగతులను సమీప హైస్కూళ్లలో విలీనం చేయడం ద్వారా మార్పు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం ఇది తప్పుడు నిర్ణయమని.. దీనిని సరిచేస్తామంటూ చేస్తున్న హడావిడి, అసంబద్ధ నిర్ణయాలతో విద్యాశాఖను బలహీనపర్చేలా ఉన్నాయని ఆ శాఖ అధికారులే అంటున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ఆదేశాల అమలు, తల్లిదండ్రుల కమిటీల నుంచి తీర్మాన ఆమోదాలను బలవంతంగా చేయించడం కోసం జిల్లాలో విద్యాశాఖ అధికారులు మునిగిపోయారు.

వెనక్కి అంటే ఒక పాఠశాలకేనట

జిల్లాలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో 3,4,5 తరగతుల వారిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమీప హైస్కూళ్లలో విలీనం చేసింది. ఈ చర్య ఇక్కడికే పరిమితం చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ గతంలో విలీనమైన 3, 4,5 తరగతుల విద్యార్థులు ఏ పాఠశాల నుంచి వచ్చారో వారిని తిరిగి అక్కడికే పంపాలని అధికారులకు ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకునే పనిలో ఉండగానే మళ్లీ వెనక్కు పంపాల్సిన విద్యార్థులను ఆయా పాఠశాలలకు కాకుండా ఏ స్కూలులో ఎక్కువ మంది ఉంటారో అక్కడికి పంపాలని, మిగిలిన పాఠశాలలను అలాగే ఉంచాలన్న ఆదేశం అందింది. దీంతో పాత విధానం ఎక్కడ అమలు చేసినట్టని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా గత ప్రాథమిక పాఠశాలలో 1,2 తరగతే ఉంటాయి. దీనికి ఒక ఉపాధ్యాయుడే ఉంటాడు. ఇలా చేయడం అంటే విద్యార్థులతో చెలగాటం అడటమే అవుతుంది.

అంగన్‌వాడీలను కలిపేస్తారట: ప్రస్తుతం1,2 తరగతులతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలకు ఏకో పాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలల సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఇందులో కలిపి అంగన్‌వాడీకి వచ్చే పిల్లలను పాఠశాలలో పెట్టి చదివిస్తే సంఖ్య పెరగడం, అంగన్‌వాడీ టీచర్‌ కూడా అక్కడే పని చేస్తారు కాబట్టి ఇద్దరు టీచర్లు అవుతారన్న అభిప్రాయం కల్పిస్తోంది ప్రభు త్వం. దీనివల్ల అంగన్‌వాడీలకు వచ్చే పసిపిల్లల ఇబ్బందులు అన్నిఇన్నీకావు.

30 మందిని చేర్పిస్తే ఐదో క్లాస్‌

జిల్లాలో ప్రస్తుతం ఉన్న 1,2 తరగతుల పాఠశాలలకు ఐదోతరగతి వరకు కొనసాగాలంటే ఒక్కో పాఠశాలకు ఈనెల 15లోగా 30 మంది విద్యార్థులను చేర్పించాలని విద్యాశాఖ మౌఖిక ఆదేశాలిచ్చింది. హైస్కూళ్ల నుంచి తిరిగి వచ్చే 3,4,5 తరగతుల విద్యార్థులు ఒక పాఠశాలకే పంపిస్తారు కాబట్టి మిగిలిన 1,2 తరగతుల పాఠశాలకు పై తరగతుల నిర్వహణ ఉండదు. దీంతో ఇలాంటి పాఠశాలకు 30 మంది విద్యార్థులను చేర్పించే మెలికను పెట్టారని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఈ విధానం తొలగించే అవకాశమూ ఉందని అంటున్నారు. ఇలాంటి నిబంధన ఉపాధ్యాయులు, పాఠశాల విద్యతో చెలగాటం అడటమేనని వాపోతున్నారు.

యూపీ స్కూల్‌ను పరిశీలిస్తే..

యూపీ స్కూళ్లలో 6,7,8 విద్యార్థుల సంఖ్య 30 లేదా ఆపై సంఖ్య ఉంటే ఆ స్కూలు అక్కడే ఉంటుంది. ఉదాహరణకు కురబలకోట మండలం ముదివేడు ఉర్దూ యూపీ స్కూలులో 6,7,8 తరగతులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 30 లోపలే ఉంది. ఈ నిబంధన అమలు చేస్తే ఇక్కడ పై తరగతుల నిర్వ హణ నిలిపివేస్తారు. ఈ విద్యార్థులంతా 15 కిలోమీటర్ల దూరంలోని పీలేరు నియోజకవర్గానికి చెందిన మండల కేంద్రం గుర్రంకొండ లేదా 20 కిలోమీటర్ల దూరంలో మదనపల్లె యూపీ స్కూళ్లకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా విద్యా ర్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్‌ పెరుగుతారు.

జిల్లాలో విద్యార్థులు, పాఠశాలల వివరాలు

ప్రాథమిక పాఠశాలలు: 1,711

విద్యార్థులు : 43,192

ప్రాథమికొన్నత పాఠశాలలు: 162

విద్యార్థులు: 11,202

ఉన్నతపాఠశాలలు: 304

విద్యార్థులు: 79,232

మొత్తం పాఠశాలలు: 2,177

విద్యార్థులు: 1,33,626

(కొత్త విధానాలతో ఈ పాఠశాలల సంఖ్య

తారుమారు కాబోతోంది)

ఒక స్కూలు ఖాళీ

కొత్తగా ప్రతిపాదిస్తున్న విధానంపై ఒక సారి పరిశీలిస్తే..ఉదాహరణకు బి.కొత్తకోట మండలంలోని గట్టు జెడ్పీ హైస్కూలులో సమీపంలోని గుట్టపాళ్యం, గట్టు తెలుగు ప్రాథమి పాఠశాలల నుంచి 3,4,5 తరగతుల విద్యార్థులను కలిపారు. ఇప్పుడు వీరిని ఈ రెండు పాఠశాలలకు తిరిగి పంపాలి. అయితే ఒక పాఠశాలకు మాత్రమే అందరినీ పంపుతారు. ఒక పాఠశాల ఖాళీగా ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి స్కూలుకు వచ్చే విద్యార్థులను ఇబ్బంది తెచ్చిపెట్టడమే కాక కొత్త సమస్యను తీసుకొస్తుంది.

30కి తగ్గితే యూపీ స్కూళ్లు గోవిందా

ఇప్పుడు జిల్లాలో యూపీ స్కూళ్ల మనుగడకు గండం పొంచి ఉంది. జిల్లాలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న యూపీ స్కూళ్లలో 6, 7, 8 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య 30కి మించాలి. ఇందులో ఒకరు తగ్గినా ఆ తరగతులను యూపీ స్కూళ్ల నుంచి తొలగించి సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీనికోసం గురువారం జిల్లాలోని విద్యాశాఖ అధికారులు సంబంధిత హెచ్‌ఎంలు, తల్లిదండ్రుల కమిటీలు ఆమోదించిన తీర్మానం కోసం తంటాలు పడ్డారు. ఈ తీర్మానం ఆమోదమోగ్యం కాదని యూపీ స్కూళ్లు హెచ్‌ఎంలు, కమిటీలు వ్యతిరేకించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలు తీర్మానం ఇవ్వాల్సిందేనని విద్యాశాఖ అధికారులు పట్టుబట్టి ఆమోదాలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఎన్ని యూపీ స్కూళ్లు మూతపడతాయో లెక్క తేలనుంది.

3,4,5 తరగతులు మళ్లీ యథా స్కూళ్లకు పంపాలని సూచన

ఇప్పుడు వీళ్లను ఒక పాఠశాలకే పంపాలని ఆదేశం

రోజుకో ఆదేశాలతో విద్యాశాఖ అధికారుల్లో అలజడి, గందరగోళం

విద్యార్థులతో చెడుగుడు! 1
1/1

విద్యార్థులతో చెడుగుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement