
ఇది కథ కాదు.. అంతులేని వ్యఽథ.!
● ఆమె జీవితమంతా శోకమే
● తొమ్మిది మందిలో ఆరుగురు బిడ్డలు చనిపోయారు
● ఇక జీవితమెందుకుని మనస్తాపంతో ఆత్మహత్య
కురబలకోట : కనిపెంచి పెద్ద చేసిన బిడ్డలు ఏడుగురు వివిధ కారణాలతో ఒకరి తర్వాత ఒకరుగా చనిపోవడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం వెలుగు చూసింది. గ్రామస్తులతో పాటు ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు..మండలంలోని సింగన్నగారిపల్లెకు చెందిన కన్మెమడుగు ఈశ్వరమ్మ (80)కు తొమ్మిది మంది సంతానం. ఐదుగురు మగ బిడ్డలు, నలుగురు ఆడపిల్లలు. వీరిలో గత 20 ఏళ్లుగా వివిధ కారణాలతో ఉన్న ఐదుగురు మగ బిడ్డలు ఒకరి తర్వాత ఒకరుగా చనిపోయారు. మరో ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. భర్త కూడా మృతి చెందారు. అయినా గుండె రాయి చేసుకుని జీవితాన్ని వెళ్లదీయసాగింది. వీరిలో గత ఏడాది ముఖ్యంగా ఇద్దరు కుమారులు చనిపోవడం ఆమెను మరింత కుంగదీసింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. అయితే కన్నబిడ్డలు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు చనిపోవడం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. పైగా వృద్ధాప్యం వెంటాడసాగింది. ఇటీవల ఉగాది పండుగకు చనిపోయిన బిడ్డల జ్ఞాపకార్థం కొత్త దుస్తులు నిలువుగా పెట్టింది. వారిని తలచుకుని ఎంతగానో బాధపడింది. బిడ్డలు వెళ్లిపోయారు.. నేను కూడా వారి చెంతకు వెళ్లిపోతానని స్థానికులకు చెప్పేది. జీవితంలో అల్లకల్లోలాన్ని చవి చూసింది. విధిరాతకు చింతించింది. బిడ్డలు లేని జీవితం వ్యర్థమనుకుంది. దీనికి తోడు జీవితం శోకమయమైంది. ఇక ఎవరి కోసం బతకాలి.. బతికుండి ఏం సాధించాలని ఇరుగుపొరుగువారితో చెబుతూ మథనపడినట్లు చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో వారం క్రితం ఆమె స్వగ్రామం సింగన్నగారిపల్లె నుంచి పుట్టినిల్లయిన కుక్కరాజుపల్లెకు వెళుతున్నానని ఇంటి వద్ద నుంచి బయలు దేరింది. కుటుంబీకులు కూడా పుట్టినింటికి వెళ్లి ఉంటుందని భావించారు. అయితే ఆమె మార్గమధ్యంలోని కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్డు పక్కనున్న తేనెకొండ అటవీ ప్రాంతంలో కొంత దూరం వెళ్లింది. అక్కడ చీరతో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయింది. పోలీసులు మృత దేహాన్ని శనివారం కనుగొన్నారు. తొలుత గుర్తు తెలియని శవంగా భావించారు. ఆ తర్వాత సింగన్నగారిపల్లె గ్రామస్తులు ఈ విషయాన్ని తెలుసుకుని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.