
మదనపల్లెలో వృద్ధురాలి హత్య
మదనపల్లె : మదనపల్లెలో వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఆమె వద్ద ఉన్న రూ.2 లక్షల నగదు, ఒంటిపై ఉన్న నగలు దోచుకుని హత్య చేశారని కుటుంబ సభ్యులు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు,పోలీసులు తెలిపిన వివరాలు... మదనపల్లె పట్టణం చంద్రాకాలనీలోని లక్ష్మినగర్‌లో నివాసముంటున్న రెడ్డప్ప భార్య గంగులమ్మ (73) గాజుల వ్యాపారం, జాతరలో బొమ్మల వ్యాపారం చేస్తూ జీవిస్తుంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా అందరికి వివాహమైంది. గంగులమ్మ సోదరి లక్షుమ్మ కుమారుడు వెంకటరమణ భవన నిర్మాణం పనులు చేస్తూ కొత్త ఇండ్లు రంగారెడ్డికాలనీలో నివాసమున్నాడు. శుక్రవారం ఇంటి వద్ద పనులు చేసే క్రమంలో ప్రమాదశాత్తు నీటి తొట్టెలో పడి గాయపడ్డాడు. వెంకటరమణ తిరుపతిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గంగులమ్మ వైద్య చికిత్స కోసం డబ్బు అవసరమవుతుందని భావించి, చీటీ ద్వారా తనకు వచ్చిన నగదు, కుమార్తె ఇచ్చిన నగదు మొత్తం రూ.2లక్షలు తీసుకుని శనివారం ఉదయం 6 గంటలకు తిరుపతికి బయలుదేరింది .ఇంటి వద్ద నుంచి బైపాస్ మెయిన్‌రోడ్డులోకి వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తుండగా పట్టణంలోని ఎగువ కురవంక భువనేశ్వరి నగర్‌కు చెందిన గంగరాజు కుమారుడు విష్ణువర్దన్ ఏపి03 టీవీ 4314 నంబరు గల ఆటోతో ఆటువైపుగా వచ్చాడు. గంగులమ్మను ఆటోలో ఎక్కించుకున్నాడు. తాను తిరుపతికి వెళ్లాలని, ఆస్పత్రిలోని బంధువులకు డబ్బులు ఇచ్చి రావాలని చెప్పింది. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాల్సిందిగా కోరింది. అయితే ఆటో డ్రైవర్ ఆర్టీసీ బస్టాండుకు రాకుండా వెంగమాంబ సర్కిల్ మీదుగా బైపాస్‌రోడ్డులోకి గంగులమ్మను తీసుకెళ్లాడు. ఇదే విషయమై ఆమె దారి వెంట అతనితో పోట్లాడుతూ గట్టిగా అరవసాగింది. ఆటోను బైపాస్‌రోడ్డులోని నిమ్మనపల్లె సర్కిల్ వద్ద నిమ్మనపల్లె మార్గంలోని చెరువు మరవ వద్దకు మళ్లించాడు. అక్కడే ఆటోను నిలిపి ఉంచి ఆమైపె దాడి చేశాడు. ఆమె తల వెనుక భాగం, చెంపలు, భుజంపై గాయాలు కాగా నోటి నుండి రక్తం కారుతూ అక్కడే పడిపోయింది. ఆ సమయంలో ఆటోలో మరికొందరు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె దగ్గరున్న రూ.2 లక్షల నగదు, ఒంటిపై నగలు దోచుకుని కొందరు పరారయ్యారని స్థానికులు తెలిపారు. అయితే ఆటో డ్రైవర్ విష్ణువర్దన్ అక్కడే ఉండగా ఆమె పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయానికి ఆమె బంధువులు మరొకరు ఆక్కడికి చేరుకుని ఆమెను గుర్తించారు. తాలూకా పోలీసులు అక్కడికి చేరుకుని గమనించగా గంగులమ్మ అప్పటికే మృతి చెంది ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ విష్ణువర్దన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న నగదు, నగలు కోసమే హత్య చేశారని గంగులమ్మ కుమార్తెలు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై గంగులమ్మ కుమారుడు అంజి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై తాలూకా సీఐని విచారించగా ఘటనకు సంబంధించిన నిందితులను విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
ఆటోడ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు
రూ.2 లక్షలతో ఇంటి నుంచి
బయలుదేరిన వృద్ధురాలు

మదనపల్లెలో వృద్ధురాలి హత్య