
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
పెద్దతిప్పసముద్రం : రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. మండలంలోని చిన్నపొంగుపల్లికి చెందిన చౌడప్ప (72) బస్సులో వెళ్లేందుకు టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి క్రాస్ రోడ్డులో వేచి ఉన్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి నిలబడి ఉన్న చౌడప్పను బలంగా ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు సురేష్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహర ప్రసాద్ తెలిపారు.
గుండెపోటుతో పాస్టర్..
పీలేరు రూరల్ : మండలానికి చెందిన చర్చి పాస్టర్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తూ చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన నాంపల్లె బాబు అలియాస్ మహర్షిబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు చర్చిలలో పాస్టర్‌గా పనిచేశారు. ఆదివారం ఉదయం పీలేరు–చిత్తూరు మార్గంలోని హెబ్రోను ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వెళ్లారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం గుండెలో నొప్పిగా ఉందని తెలిపిన కొంత సమయానికే ప్రార్థన మందిలోనే స్పృహతప్పి పడిపోయారు. గమనించిన సహచరులు వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాస్టర్ మహర్షి బాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో
వృద్ధురాలు..
కలకడ : కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ, ఆర్పెంటిదిన్నె (దాసిరెడ్డిగారిపల్లె) కు చెందిన నాగసిద్దారెడ్డి భార్య ఆదిలక్ష్మి (85) మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు కలకడ పోలీసులకు సమాచారం అందించారు. కలకడ సీఐ గురునాథ ఇంటిని పరిశీలించి ఆదిలక్ష్మి శరీరంపై కాలిన గాయాలు, రక్తగాయాలు ఉండటంతో మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి కుమారుడు ద్వారకనాథరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి