
ధర పతనం.. రైతుకు శోకం
రాయచోటి : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతన్నలు వరుస నష్టాలు చవిచూస్తున్నారు. ఇంకా టమాటా రైతు కోలుకోలేని స్థితిలో ఉండగా.. మరోవైపు వంగ తోటలు సాగు చేసిన వారు నిలువునా మునిగిపోతున్నారు. మార్కెట్‌లో వంగ ధర పడిపోవడంతో రైతు కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. గత రెండు నెలల వరకు గిరాకీ ఉండటంతో.. వంగ పంటను అధికంగా సాగు చేశారు. కాయలను కోసి మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు 20 కిలోల ప్యాకెట్‌కు రూ.50 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.3 నుంచి 4 మాత్రమే పలుకుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో రూ. 20 ఉండగా ఈ ఏడా రూ.3 నుంచి 4కు పడిపోయింది.
దోచుకుంటున్న వ్యాపారులు
జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో వంగ సాగయ్యేది. ఈ ఏడాది వెయ్యి ఎకరాలకు పైగా సాగులోకి తెచ్చారు. చైన్నె, ఏలూరు, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రోజుకు 20 నుంచి 30 టన్నుల పంట రవాణా అవుతుండేది. ఆయా ప్రాంతాల్లో కూడా వంగ సాగు పెరగడంతో.. నేడు బయటి ప్రాంతాల మార్కెట్ రవాణా 50 శాతానికి తగ్గింది. దీనిని ఆసరాగా చేసుకొని స్థానిక వ్యాపారాలు దోచుకుంటున్నారు. రైతుల వద్ద నిల్వ చేసుకొనే సామర్థ్యం లేకపోవడంతో.. అడిగిన ధరకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటపై చేసిన అప్పులు, వడ్డీలు ఎలా తీర్చాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారు.
వినియోగదారులకు..
కూరగాయల మార్కెట్, రైతు బజార్‌లో వినియోగదారులకు మాత్రం వంకాయలను రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. లాభాన్ని దళారులు, వ్యాపారులు కలిసి ఆర్జిస్తున్నారు. నిల్వ చేసుకునే సామర్థ్యం, వినియోగదారులకు అమ్మే అనుకూలత వ్యాపారులకు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. పంట సాగు చేసిన రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు.
పడిపోయిన వంకాయల రేట్లు
పెట్టుబడి కూడా దక్కని వైనం
అప్పుల పాలవుతున్న
అన్నదాత

ధర పతనం.. రైతుకు శోకం

ధర పతనం.. రైతుకు శోకం