
రైతులను ఆదుకోవాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి: అకాల వర్షాలు, ఈదురు గాలులతో రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం రాయచోటిలో పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందివ్వాలని కోరారు. మామిడి పంట ప్రారంభ దశలో మంచు ప్రభావంతో పూత రాలిపోయిందన్నారు. అంతో ఇంతో పూత నిలిచి పిందె పట్టినా ఎక్కువ ఎండలు వల్ల అవీ రాలిపోయాయన్నారు. మందులు కొట్టి అరకొరగా పిందెలు నిలబెట్టుకుని దిగుబడి వస్తున్న తరణంలో.. అకాల వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మామిడి పంటకు ప్రభుత్వం వాతావరణ ఆధారిత భీమా పథకం ద్వారా ఎకరాకు ప్రీమియం రూ. 2250 చొప్పున కట్టించుకుందని తెలిపారు. మామిడి రైతులపై మానవతా దృక్పథంతో మామిడి పంటకు బీమా చేయని వారికి కూడా పరిహారం అందించాలన్నారు. ఖరీప్, రబీ సీజన్‌లలో పంటలు రాక తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతన్నలకు ఈ అకాల వర్షాలు, ఈదురు గాలులతో మరిన్ని కష్టాలు తోడయ్యాయన్నారు. ఉద్యానవన శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్న వివరాలను సేకరించి త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని కోరారు.