
రక్తమోడుతున్న రోడ్లు
సాక్షి రాయచోటి: ప్రయాణం ప్రమాదంగా మారుతోంది. ప్రతి నిత్యం రోడ్లు రక్తమోడుతున్నాయి. ఎక్కడ చూసినా ఎర్రటి ఎండలకు తోడు నడిరోడ్డుపై జరుగుతున్న ప్రమాద ఘంటికలు వేడి పుట్టిస్తున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారులతోపాటు సాధారణ రోడ్లపై కూడా ప్రమాదం నిత్యకృత్యమైంది. బయటికి వచ్చి రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మత్తు ఏదైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. దేవాలయాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు, వేడుకలు, విహార యాత్రలు, కర్మకాండలు, ఇతర బంధువులు, స్నేహితుల వద్దకు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా.. జాగ్రత్తగా ఉంటున్నా కూడా చిన్నపాటి పొరపాటు, గ్రహపాటు కారణంగా మృత్యువు కబళిస్తోంది. అంతేకాకుంగా వేగం కూడా ఒక్కోసారి అదుపు తప్పడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
భయం.. భయం
అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా కడప–రేణిగుంట రహదారితోపాటు కడప వయా రాయచోటి, పీలేరు, చిత్తూరు రహదారితోపాటు మదనపల్లె, పీలేరు జాతీయ రహదారులు ఉన్నాయి. అవి కాకుండా అనేక రహదారులు ఉన్నాయి. అయితే ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళిస్తోంది. ఇప్పటికే ఒక్క ఏడాదిలోనే సుమారు 380కి పైగా ప్రమాదాలు చోటు చేసుకోగా, 1200 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో 635 మందికి పైగా గాయపడిన సంఘటనలు ఉన్నాయి. ఎక్కువ జాతీయ రహదారులపైనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో జాతీయ రహదారులపై అనేక చోట్ల అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోపోవడంతో, రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం కూడా ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి.
ఇటీవల పెరుగుతున్న ప్రమాదాలు
రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడంతో సమస్య
వాహనదారులను చైతన్యం చేయాల్సిన అవసరం
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

రక్తమోడుతున్న రోడ్లు