
అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ
రాయచోటి : జిల్లాలో పెట్రేగుతున్న అసాంఘిక శక్తులపట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరిపి, పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. నేర నిరూపణలకు శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నేర పరిశోధన చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేయాలని ఆదేశించారు. క్రికెట్ బెట్టింగ్, జూదం జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాలు, నిషేధిత మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతను, ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాలలోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు సంబంధిత పోలీసులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలన
అంతమే మాలల పంతం
– మాలమహానాడు జాతీయ వర్కింగ్
ప్రెసిడెంట్ యమలా సుదర్శనం
మదనపల్లె : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేవలం ఒక కులానికి మద్దతు తెలిపి, మిగిలిన వారిపై నిర్లక్ష్యం కనబరిచిన చంద్రబాబు పాలన అంతమే మాలల పంతమని మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం తెలిపారు. గురువారం పట్టణంలోని మాలమహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. 2011 గణాంకాల ప్రకారం 2025లో వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాలలకు అన్యాయం చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని రానున్న స్థానిక సంస్థల్లో మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు యమలా చంద్రయ్య, గుండా మనోహర్, వీరనాల మాణిక్యం, ఎలక్ట్రిషియన్ మోహన్, పలమనేరు జయశంకర్, గంగరాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతు ఆత్మహత్య
ముద్దనూరు : మండలంలోని ఉప్పలూరు గ్రామంలో అప్పుల బాధ భరించలేక మడక రామకృష్ణ(49) అనే కౌలు రైతు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు కౌలు వ్యవసాయంలో ఆదాయం లేకపోవడంతో అప్పులపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ పొలంలో వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి