
మళ్లీ టూ ట్వంటీ ఆక్రమణకు యత్నం !
కురబలకోట : మండలంలోని అంగళ్లు మిట్స్ కళాశాల సమీపంలోని సర్వే నంబరు టూట్వంటీ (220) భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం పుంగనూరుకు చెందిన కొందరు ఈ భూమిలో ప్రవేశించి రేకులు వేసేందుకు ప్రయత్నించారు. దీంతో మొదటి నుంచి ఈ భూమిపై హక్కులతో పాటు స్వాధీన అనుభవంలో వి. వెంకటరమణ రాజు (రాజు), సుబహాన్ తదితరులతో పాటు ఇక్కడ ప్లాట్లు కొన్నవారు వీరిని నిలువునా అడ్డుకున్నారు. భూ హక్కు పత్రాలు చూపాలని పట్టుబట్టారు. పుంగనూరుకు చెందిన వారు వినకుండా రేకులు వేస్తామని లారీలో వాటిని తెప్పించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల వారు పరస్పరం మోహరించారు. ఈ విషయం ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌కు సమాచారం అందడంతో హుటాహుటిన ఆయన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. ఇరువర్గాల వారితో చర్చించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుండడంతో ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేట్‌మెంట్లు రికార్డు చేసి వదిలి పెట్టారు. భూ వివాదాన్ని చర్చల ద్వారా లేదా చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని ఎస్‌ఐ సూచించారు. దాదాగిరిలా వ్యవహరిస్తే తగిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్‌ఐ హెచ్చరించారు. ఇదిలా ఉండగా టూట్వంటీ సర్వే నంబరులో ఐదున్నర ఎకరం ఉంది. ఇది హైవేకు ఆనుకుని ఉంది. రూ. 10 కోట్లకుపైగా విలువ చేసేదిగా ఉంది. గతంలో కూడా వివిధ ప్రాంతాల వారు ఈ భూమిపై కన్నేసి రాద్ధాంతం చేశారు. ఒకరైతే చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసి ఆక్రమించారు. ఇక్కడ ప్లాట్లు కొన్న వారు స్థానికులు మూకుమ్మడిగా తరలి వచ్చి ఈ ఫెన్సింగ్‌ను ఒక్కసారిగా ధ్వంసం చేయడంతో పాటు నిమిషాల్లో నేల మట్టం చేశారు. మదనపల్లెకు చెందిన వి. రాజు తదితరులు ఈ భూమిని 2016లో అంగళ్లుకు చెందిన ఇస్మాయిల్, ఖలీల్, సీకే మహమ్మద్ తదితరుల నుండి కొన్నారు. ప్లాట్లు వేసి 72 మందికి విక్రయించారు. కొందరు కట్టడాలు కూడా నిర్మించారు. రికార్డు కూడా వీరికి పక్కాగా ఉంది. అయినా ఎవరెవరో వచ్చి ఆక్రమించే యత్నం చేస్తున్నారు. గురువారం వచ్చిన వారికి కూడా ఈ భూమికి సంబంధించి కనీసం వన్‌బీ లేదా పట్టాదారు పాసుపుస్తకం కూడా లేదు. మాదే భూమంటూ చొరబడే యత్నం చేశారు. 1923లో సదరు భూమిని వీరు విక్రయించినట్లు రికార్డులు కూడా ఉన్నాయి. అయినా భూమి తమదేనంటూ ఆక్రమించే యత్నం చేయడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. అంగళ్లులోని టూ ట్వంటీ భూ వివాదం ఎనిమిదేళ్లుగా నడుస్తూనే ఉంది. అన్నమయ్య జిల్లాలోనే టూట్వంటీ భూ వివాదం హైటెన్షన్‌గా మారింది. జిల్లాలోనే అత్యంత వివాదాస్పద భూమిగా పేరు పొందింది
అడ్డుకున్న హక్కుదారులు
ఇరు వర్గాలను స్టేషన్‌కు తరలించిన ఎస్‌ఐ
సడలిన ఉద్రిక్తత