ప్రొద్దుటూరు క్రైం : కొన్ని రోజుల క్రితం వచ్చిన అల్లుఅర్జున్ పుష్ప–2 సినిమా అందరికీ గుర్తే ఉంటుంది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ పోలీసులకు దొరకకుండా వారికి చుక్కలు చూపిస్తాడు. కథలో భాగంగా పుష్ప చెప్పే ‘దమ్ముంటే పట్టుకో షెకావత్తు.. పట్టుకుంటె వదిలేస్త సిండికేట్టు’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ప్రొద్దుటూరులో కూడా కొన్ని రోజుల నుంచి వరుస దొంగతనాలు చేస్తూ దొంగలు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇళ్లల్లోకి చొరబడి వరుసగా చోరీలు చేస్తున్నా పోలీసులు వారిని పట్టులేకపోతున్నారు. ఇన్ని రోజులు ప్రజల ఇళ్లలో చోరీలు చేసిన దొంగలు ఈ సారి ఎస్‌ఐ ఇంటినే టార్గెట్ చేశారు. ప్రొద్దుటూరు టూ టౌన్ ఎస్‌ఐ ధనుంజయ ఇంట్లో చోరీ చేసి ‘దమ్ముంటె పట్టుకో ధనుంజయ..! పట్టుకుంటే వదిలేస్త దొంగతనాలు’ అంటూ ఎస్‌ఐకే సవాల్ విసురుతున్నారు. ఎస్‌ఐ అనే భయమే లేకుండా ఆయన ఇంట్లో హుండీని ఎత్తుకెళ్లారు. ఎస్‌ఐ ఇంట్లో చోరీ జరగడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ప్రొద్దుటూరులో దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ఇళ్లల్లో చొరబడ్డారు. ఒక ఇంట్లో మాత్రం పెద్ద ఎత్తున బంగారు, వెండి, నగదును దొంగలు దోచుకెళ్లారు..ఎస్‌ఐ ఇంట్లో హుండీని ఎత్తుకెళ్లారు. మిగిలిన రెండు ఇళ్లల్లో విలువైన వస్తువులేమీ దొంగలకు దొరకలేదు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉన్న నరాల బాలిరెడ్డి కాలనీలో విలాసవంతమైన ఇళ్లను నిర్మించారు. ఈ కాలనీలోని నాలుగు ఇళ్లలో గురువారం అర్థరాత్రి 1.30 సమయంలో దొంగలు పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎనమల చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో సుమారు 60 తులాల బంగారు, 3 కిలోల వెండి, రూ. 12 లక్షల నగదును దోచుకెళ్లారు. వారి ఇంటి సమీపంలో ఉన్న టూ టౌన్ ఎస్‌ఐ ధనుంజయ ఇంట్లో హుండీని దోచుకెళ్లారు. ఎస్‌ఐ ఇంటి పక్కనే ఉన్న ఈశ్వరరెడ్డి, ఎల్లంశెట్టి రాజా ఇంట్లో విలువైన బంగారు నగలు ఏమీ దొరకలేదు.
కనిపెట్టి కన్నేశారు..
చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు చెన్నకేశవరెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని వివాహం ఈ నెల 13,14 తేదీల్లో ప్రొద్దుటూరులోని వైవీఆర్ కల్యాణమండపంలో జరిగింది. ఇందులో భాగంగా ఇంటికి తాళం వేసి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులందరూ 16న కర్నూలుకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చోరీకి పాల్పడ్డారు.
ఎస్‌ఐ ఇంట్లో చొరబడిన దొంగలు
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
60 తులాల బంగారు, రూ. 12 లక్షలు నగదు, 3 కిలోల వెండి అపహరణ
శుభ కార్యానికి కర్నూలుకు వెళ్లిన ఓ కుటుంబం
ఐదుగురు కలిసి చోరీ చేసినట్లు
సీసీ కెమెరాల్లో నిర్ధారణ
ఎస్‌ఐ ఇంటిని వదలని పోలీసులు
ఎస్‌ఐ ధనుంజయుడు ఇంట్లో దొంగతనం జరగడం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల ఇళ్లకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల ఇళ్ల పరిస్థితి ఏంటని అంటున్నారు. ఎస్‌ఐ ధనుంజయుడు తన యూనిఫాంను సోఫాపై ఉంచారు. యూనిఫాంను చూసిన దొంగలు ఇది పోలీసు అధికారి ఇల్లని గ్రహించి ఉంటారు. అయినా ఏ మాత్రం భయపడకుండా ఇంట్లో ఉన్న హుండీని ఎత్తుకొని వెళ్లారు.
ఎస్‌ఐ ఇల్లు సహా నాలుగు ఇళ్లలో చోరీ
ఎస్‌ఐ ఇల్లు సహా నాలుగు ఇళ్లలో చోరీ