
పథకాల ప్రగతి సాధనలో లక్ష్యాలను పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
రాయచోటి: ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్‌నుంచి ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్‌స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి వీసీలో జిల్లా కలెక్టర్, డీఆర్‌ఓ మధుసూదనరావు పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 19న మూడో శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఉచిత ఇసుక పథకంలో జిల్లా అవసరాలకు తగినంత ఇసుక నిల్వలను సిద్ధం చేసుకోవాలన్నారు. వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో చేపట్టిన ఎంఎస్‌ఎంఈల సర్వేను పటిష్టంగా నిర్వహించాలన్నారు.
పదివేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి కృషి
జిల్లాలో పదివేల ఎకరాల్లో పచ్చిమేత పెంపకానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు, డీఎల్‌డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రెవెన్యూ అంశాలు, నిత్యావర వస్తువుల పంపిణీ, పల్లె పండుగ పనులు, ఎంజీఎన్‌ఆర్ ఈజీఎస్ పనులు, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష చేసి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. నిరుపయోగంగా, వ్యవసాయ వినియోగం లేని భూములను నేపియర్ గడ్డి పెంపకానికి గుర్తించిన ఏజెన్సీకి లీజుకు ఇస్తే ఎకరాకు వార్షికంగా రూ. 30 వేలు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాలు లీజుకు ఇస్తే రైతులకు నికర ఆదాయం ఉంటుందన్నారు. పల్లె పండుగ క్రింద జిల్లాలో చేపట్టిన పనులన్నింటినీ ఈ మాసాంతంలోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, వైఖోమ్ నదియా దేవి, డిఆర్‌ఓ మధుసూదనరావు, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.