
దేవదాయ లీజులపై క్షేత్రస్థాయి పరిశీలన
బి.కొత్తకోట: ‘దేవదాయ వేలం పాటలు పారదర్శకంగా జరిగేనా’,(ఈనెల 10న), ‘చెన్నకేశవా నీ భూములు గోవిందా’(నవంబర్ 26న ) శుక్రవారం ప్రచురితమైన ‘ఆలయంలోకి మురికినీరు’శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన కథనాలపై స్పందించిన దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాఽథ్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. స్థానిక గ్రామదేవత గంగమ్మ ఆలయానికి చెందిన వాణిజ్య గదులు, మాన్యం భూమిలో స్థలాల లీజుపై నిబంధనలు పాటించడం లేదని సాక్షిలో ప్రచురితమైన కథనంతో ప్రజలు ఈనెల 10న నిర్వహించిన వేలాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై విశ్వనాఽథ్ ఇక్కడి సమస్యలను పరిశీలించారు. వాణిజ్య గదులను పరిశీలించాక మాన్యం భూమిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకుంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు లేనిపక్షంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంజనేయస్వామి ఆలయ మాన్యం భూమిలో అను మతి లేకుండా పెట్టుకున్న బంకులను తొలగించాలని నిర్వహకులను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ మొహమ్మద్ అజారుద్దీన్‌ను కలిశారు. సాక్షిలో ప్రచురితమైన చెన్నకేశవా నీ భూములు గోవిందా శీర్షిక ప్రచురితమైన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన భూములను వెంకటేశ్వరస్వామి ఆలయం పేరిట నమోదు చేశారని, దీన్ని మార్పు చేయాలని కోరగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. తర్వాత దిగువబస్టాండ్‌లోని పురాతన చెన్నకేశవ స్వామి ఆలయంలో చేరిన వర్షపునీటిని పరిశీలించారు. ఆలయం దిగువన ఉండటంతో పైనుంచి వర్షపునీళ్లు, మురికినీరు ఆలయంలోకి ప్రవహిస్తున్నట్టు గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనాలను పరిశీలించి వాటి పరిష్కారం కోసం బి.కొత్తకోటలో పర్యటించినట్టు చెప్పారు. గ్రామదేవత ఆలయ మాన్యం భూమిని వినియోగించుకుంటున్న వ్యక్తులను అక్కడినుంచి ఖాళీ చేయాలని ఆదేశించామన్నారు. వాణిజ్య గదుల విషయంలో ప్రస్తుతం ఉన్న లీజు విధానాన్ని మార్పు చేసి 11 ఏళ్లు లీజు ఇచ్చేలా, ప్రతిఏటా అద్దె పెంచేలా కమీషనర్‌కు ప్రతిపాదనలు పంపుతున్నట్టు చెప్పారు. మాన్యం భూమిలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకునేలా వేలం నిర్వహించి స్థలాలను అప్పగిస్తామన్నారు. చెన్నకేశవ ఆలయం జీర్ణోద్ధరణ కోసం సాంకేతిక అధికారులను పంపి.. ప్రతిపాదనలు కమిషనర్‌కు నివేదించి నిధుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పారు. కాగా చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన మాన్యం భూముల్లో ఇసుకను అక్రమంగా తరలించకుంటున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈవో మునిరాజకు కమీషనర్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు చెప్పారు. ఇందులో ఒక ఇంక్రిమెంటును ఎందుకు కట్ చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటిసులో కమిషనర్ కోరినట్టు చెప్పారు.
ఈవో మునిరాజుకు షోకాజ్ నోటీసు

దేవదాయ లీజులపై క్షేత్రస్థాయి పరిశీలన