
చెట్టును ఢీకొన్న మారుతీ వ్యాన్
మదనపల్లె/చిన్నమండెం : వేగంగా వస్తున్న మారుతి వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మదనపల్లె మండలంలో ఈ సంఘటన జరిగింది. లక్కిరెడ్డిపల్లె మండలం, చింతకుంటవారిపల్లెకు చెందిన అల్లా బక్షు, జరీనా దంపతుల కుమారుడు ఆరీఫుల్లా (42) అప్పకొండయ్యగారిపల్లె ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేసేవాడు. ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో చేరాడు. చిన్నమండెం మండలం మల్లూరులో ప్రస్తుతం ఉంటున్నాడు. చిన్న మండెంలో దొడ్ల మిల్క్ డైరీ షాప్ నిర్వహిస్తున్న మోదిన్ సాబ్ కుమారుడు ముజాహిద్దీన్ (35)తో కలసి మారుతి ఓమ్ని వ్యాన్‌లో వ్యక్తిగత పనులపై మదనపల్లెకు వచ్చారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు చిన్నమండెం వెళ్లేందుకు అదే వాహనంలో వాయల్పాడు, గుర్రంకొండ మీదుగా బయలుదేరారు. మార్గమధ్యంలోని మదనపల్లె – తిరుపతి రహదారిలో సీటీఎం గంగమ్మ గుడి ఆలయ సమీపంలో, ఆరీఫుల్లా వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ప్రమాదంలో ఆరీఫుల్లా తీవ్రంగా గాయపడి డ్రైవింగ్ సీట్ లోనే మృతి చెందాడు. పక్కనే ఉన్న ముజాహిద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు గంట సేపటి వరకు 108 వాహనం సంఘటన స్థలానికి రాకపోవడంతో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యమైంది. మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకున్న బాధితుడు ముజాహుద్దీన్‌కు అత్యవసర చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకువెళ్లారు. ప్రమాద సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దుర్మరణం చెందిన ఆరిఫుల్లా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య ఆస్మా ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
వ్యక్తి దుర్మరణం
మరొకరి పరిస్థితి
విషమం

చెట్టును ఢీకొన్న మారుతీ వ్యాన్

చెట్టును ఢీకొన్న మారుతీ వ్యాన్

చెట్టును ఢీకొన్న మారుతీ వ్యాన్