
విద్యుత్ కనెక్షన్ తీసుకోవద్దన్నందుకు కొడవలితో దాడి
రాయచోటి టౌన్ : తమ విద్యుత్ మోటార్ నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకోరాదని వారించినందుకు రేపన లక్ష్మిదేవి, రేపన రామకృష్ణలపై రేపన ప్రభాకర్ అనే వ్యక్తి కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి మండల పరిధిలోని మాధవరం గ్రామం వడ్డెపల్లెకు చెందిన రేపన లక్ష్మిదేవి, రేపన రామకృష్ణలు బావ మరదళ్లు. వారి పొలం వద్ద అమర్చుకున్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్ల నుంచి రేపన ప్రభాకర్‌కు చెందిన విద్యుత్ మోటారుకు విద్యుత్ కనెక్షన్ అమర్చేందుకు వెళ్లాడు. అయితే వీరు తమ మోటారుకు విద్యుత్ సమస్య వస్తుందని వేరే చోటు నుంచి కనెక్షన్ తీసుకోవాలని చెప్పారు. అయితే అందుకు ప్రభాకర్ నిరాకరిస్తూ వారి మోటారు స్తంభం నుంచే విద్యుత్ కనెక్షన్ తీసుకుంటానని బెదిరించి కనెక్షన్ తీసుకొనే ప్రయత్నం చేశాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. తన మాట వినడం లేదని భావించిన రేపన ప్రభాకర్ కొడవలితో వారిద్దరిని ఊరిలో వెంటాడి నరికేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గ్రామస్తులు ఒక్కసారిగా అతన్ని పట్టుకొన్నారు. అప్పటికే లక్ష్మిదేవి, రామకృష్ణ తలకు, భుజంపైన, ఇతర భాగాలపై కొడవలితో గాయపరిచాడు. అయితే అతన్ని పట్టుకొనే క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో రేపన ప్రభాకర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యుత్ కనెక్షన్ తీసుకోవద్దన్నందుకు కొడవలితో దాడి

విద్యుత్ కనెక్షన్ తీసుకోవద్దన్నందుకు కొడవలితో దాడి