
గడ్డివాములో మగ శిశువు లభ్యం
వీరబల్లి : మండలంలోని దిగువరాచపల్లి పంచాయతీ పెద్ద దళితవాడ సమీపంలోని గంగమ్మ గుడి దగ్గర గడ్డివాములో ఆదివారం మగ శిశువును వదిలి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో వీర నాగయ్య అనే వ్యక్తి తమ గడ్డివాము దగ్గరకు వెళ్లి గడ్డి పీకుతుండగా మగ శిశువును గుర్తించాడు. వెంటనే అతను శిశువును రాయచోటి ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలపడంతో తిరిగి తన గ్రామానికి తీసుకువచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అంగన్ వాడీ సూపర్ వైజర్ సరస్వతమ్మ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం మగశిశువును స్వాధీనం చేసుకున్న అధికారులు రాయచోటి ఐసీడీఎస్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
ఘర్షణ కేసులో 11 మంది అరెస్ట్
కేవీపల్లె : ఇరువర్గాలు ఘర్షణ పడి పరస్పరం దాడి చేసుకున్న కేసులో 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మాపురానికి చెందిన రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. గొడవకు కారణమైన 11 మందిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు ఆటంకం కల్గిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
తంబళ్లపల్లె : స్థానిక మల్లయ్య కొండ కింద మద్దాతం బావి వంకలో చెట్టుకు ఉరివేసుకుని ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు.. బి.కొత్తకోట మండలం తాకట్టుమారిపల్లెకు చెందిన ఓబులేసు, నాగరత్నమ్మల కుమారుడు కిషోర్ (21) మూడు రోజులుగా కన్పించలేదని అతని కోసం పలు చోట్ల వెతికినట్లు మృతుని తండ్రి తెలిపారు. మల్లయ్యకొండ కింద మద్దాతం బావి వంకలో ఓ కానుగ చెట్టుకు యువకుడు ఉరివేసుకుని వేలాడుతున్న విషయాన్ని గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ నజీర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఉన్న పల్సర్ ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా మృతుని చిరునామా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని ఎడమచేతిపై కోసుకున్న గాట్లు ఉండటం, వేలాడుతున్న మృతదేహం కాళ్లకు చెప్పులు అలాగే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

గడ్డివాములో మగ శిశువు లభ్యం