
వృద్ధురాలికి తీవ్ర గాయాలు
రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలో యాచిస్తూ జీవనం చేస్తున్న గుర్తు తెలియని వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గురువారం స్థానికులు ఆ వృద్ధురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు హరికృష్ణ ఆ వృద్ధురాలిని పరిశీలించి ప్రథమ చికిత్స జరిపి తిరుపతి రుయాకు తరలించారు.
మనస్థాపంతో విద్యార్థిని మృతి
ములకల చెరువు : పదో తరగతిలో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం సాయంత్రం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని సెంట్రల్ స్కూల్ పంచాయతీ పెద్ద మొరవ పల్లికి చెందిన చల్లా రెడ్డప్ప కుమార్తె చల్లా నవీన(15) పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపానికి చెందిన నవీన గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
చైన్ స్నాచింగ్..
రాయచోటి : రాయచోటి పట్టణ పరిధిలోని లక్ష్మీపురం ప్రాంతంలో గురువారం ఉదయం మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు సతీమణి ఇంటి శునకాన్ని పట్టుకొని వాకింగ్ చేస్తుండగా.. కాపు కాసిన దొంగలు బైకు మీద వచ్చి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ బీవీ చలపతి తెలిపారు.
వ్యక్తిపై కత్తితో దాడి
బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరు రోడ్డులోని భారత్ పెట్రోలు బంకు సమీపంలో బుధవారం అర్ధరాత్రి బాకీ విషయమై ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కోటిరెడ్డినగర్‌కు చెందిన రమణయ్య లారీడ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. కడపకు చెందిన లారీ ఓనర్ దస్తగిరి అనే వ్యక్తి వద్ద రమణయ్య డ్రైవర్‌గా వస్తానని నమ్మబలికించి కొంత నగదును అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అయితే లారీకి డ్రైవర్‌గా వెళ్లకుండా.. డబ్బులు తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో బుధవారం దస్తగిరి బద్వేలుకు వచ్చి రమణయ్యను నిలదీశాడు. ఈ సమయంలో ఇరువురి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో దస్తగిరి తన వద్ద ఉన్న కత్తితో రమణయ్యను కడుపు భాగంలో, వీపు భాగంలో పొడిచాడు. ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని రక్తగాయాలైన రమణయ్యను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారు.
వాహనాలు స్వాధీనం
కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా రికార్డులు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం 108 ద్విచ క్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిల్లో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అ నుమానితులు, పాత నేరస్తుల ఇళ్లలో తనిఖీలు చేశా రు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించా రు. కడప టూ టౌన్ పి.ఎస్ పరిధిలోని బిస్మిల్లా నగర్ లో నిర్వహించిన కార్డన్ అండ్ సర్చ్ లో 4 ద్విచక్ర వా హనాలను స్వాధీనం చేసుకున్నారు. కడప టూ టౌన్ సి.ఐ బి.నాగార్జున, ఎస్.ఐలు హుస్సేన్, సిద్దయ్య, చిన్నచౌక్ ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
రిమ్స్ మార్చురీలో
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో గత నెల 23న గుర్తు తెలియని వ్యక్తి (35) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వచ్చాడు. అతను చికిత్స పొందుతూ ఈనెల 23న మృతి చెందాడు. అతని ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా వుంటే తమను తగిన ఆధారాలతో సంప్రదించాలని రిమ్స్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.