– రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి
రాజంపేట : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో ఉన్న పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేసిన ఘటన కశ్మీర్‌నే గాక దేశాన్నే కుదిపేయడంపై గురువారం ఆయన ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పహల్గామ్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి పిరికి చర్య అని పేర్కొన్నారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో పర్యాటకులు చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలానే దాడిలో మరణించిన వాళ్లలో ముగ్గురు తెలుగువాళ్లు ఉండటం అత్యంత బాధాకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడాలని కోరారు.
గండికోట నుంచి కొనసాగుతున్న ఔట్ ఫ్లో
కొండాపురం : గండికోట జలాశయం నుంచి గండికోట ఎత్తిపోతలపథకం నుంచి మూడు మోటర్లతో పైడిపాళెం జలాశయంకు 300 క్యూసెక్కుల నీటిని కొనసాగిస్తున్నట్లు జిఎన్‌ఎస్‌ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట జలాశయంలో 18.5 టీఎంసీలు నిల్వ ఉన్నాయన్నారు. గాలేరి నగరి సృజల స్రవంతి ప్రధాన కాలువకు 300 క్యూసెక్కుల నీటిని శెట్టివారిపల్లె మెయిన్ రెగ్యులేటర్ ద్వారా సర్వరాయ సాగర్ కు ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాన కాలువ నుంచి రైతాంగానికి సాగునీరు అవసరాల కోసం వదిలినట్లు ఆయన తెలిపారు. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయంకు ఒక టీఎంసీ నీటిని తరలించామన్నారు. గురువారం మధ్యాహ్నం మైలవరం జలాశయంకు నీటిని నిలుపుదల చేశామన్నారు.
జల్ జీవన్ ప్రాజెక్టు పూర్తి చేయాలి
చక్రాయపేట : జల జీవన్ మిషన్ కింద చేస్తున్న పనులను ఆగస్టు నాటికి పూర్తి చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు నీటిని అందించాలని నేషనల్ వాష్ ఎక్స్‌పర్ట్ (కేంద్ర పరిశీలన కమిటి) హర్యాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విజయకుమార్ సంబంధిత పనులు చేస్తున్న మెగా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం మండలంలోని కె.ఎర్రగుడి, కల్లూరుపల్లె గ్రామాల్లో జలజీవన్ మిషన్ కేంద్ర కమిటీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్ ప్రాజక్టు కింద చేస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం వారు సర్పంచులు హరిశేఖర్‌నాయుడు, నాగరత్నమ్మల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య తదితరాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో బోర్లు వేయాలంటే ఎంత మేర ఖర్చు వస్తుంది. ఎంత లోపల నీరు ఉంది. నీటిలో ఫ్లోరైడ్ ఉందా.. వాటి పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. నీటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ విజయ భాస్కర్, డీఈ సాలన్న తదితరులు పాల్గొన్నారు.
బస్సులో వెళుతూ వడదెబ్బతో మహిళ మృతి
సింహాద్రిపురం : మండలంలోని బలపనూరు గ్రామంలో గురువారం బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతురాలి అల్లుడు శివ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సులో యనమల భవాని(50) తన మనవరాలితో బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో బస్సులో మనుమరాలు ఏడుస్తున్నా భవాని నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో తోటి ప్రయాణీకులు ఆమెను లేపడంతో భవాని అక్కడే కుప్పకూలారు. దీంతో తోటి ప్రయాణీకులు ఆమెను 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే వడదెబ్బకు గురై మృతి చెందినట్లు నిర్ధారించారు.

పహల్గామ్ ఉగ్రదాడి పిరికిచర్య