Theatre Vs Home Theater : ఓ వైపు మల్టీప్లెక్సీల్లో టికెట్లు అధిక ధరలు..పార్కింగ్ ఫీజుల నుంచి పాప్‌కార్న్, కేక్‌లు, పఫ్, కూల్‌డ్రింక్ ధరలతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్స్‌కు వెళ్ళేందుకు ధైర్యం చేయడం లేదు. ఓ చిన్న కుటుంబం తమ పిల్లలతో కలిసి సరదాగా సినిమా చూద్దామంటే రూ.1500 నుంచి రూ.2,000 ఖర్చు అయ్యే పరిస్దితి ఏర్పడింది. ఇదే క్రమంలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లెక్స్, హాట్‌స్టార్, వూట్ తదితర ఓవర్ ది టాప్ వీడియో కంటెంట్ ప్రొవైడర్లు కొత్త సినిమాలను నట్టింట్లోకి తెచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్స్ వర్సస్ హోమ్ థియేటర్స్ అనే పరిస్థితి ఏర్పడింది.
యావరేజ్ అంటే కుదరదు
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 60 మూవీ థియేటర్‌లు ఉన్నాయి. నగరంలో మొత్తం పెద్ద థియేటర్‌లు 14 ఉండగా మల్టీప్లెక్స్లకు సంబంధించి ఎస్2లో మూడు స్క్రీన్‌లు, ది సినిమాలో ఐదు స్క్రీన్‌లు, రెయిన్ థియేటర్స్‌లో మూడు స్క్రీన్ లీలామహల్, సిరి థియేటర్‌లో రెండు స్క్రీన్‌లు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు, కంటెంట్ బాగున్న చిత్రాలు, కాంబినేషన్ వర్కవుట్ అయ్యే సినిమాలు రిలీజైనప్పుడు థియేటర్లు కళకళాడుతున్నాయి. గతంలోలా యావరేజ్, బిలో యావరేజ్ చిత్రాలు వస్తే ప్రేక్షకుడు థియేటర్ వైపు కన్నెత్తి చూడటం లేదు.
వాళ్లు సేఫ్.. వీళ్లు డౌట్
సినిమా విడుదల కాకముందే నిర్మాతలు చిత్రాన్ని పంపిణీ దారులకు అమ్మేస్తున్నారు. అంతేకాదు ఓటీటీ రైట్స్ కింద అమెజాన్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెట్‌వర్క్ స్క్రీమింగ్‌లకు విక్రయిస్తున్నారు. చిత్రం విడుదలయ్యాక 20 రోజుల నుంచి 30 రోజుల్లో ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపైకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే నిర్మాతల నుంచి కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్ పరిస్దితి మాత్రం దయనీయంగా ఉంటుంది. సినిమా విడుదలైన మూడు నుంచి నాలుగు వారాల్లోపే థియేటర్స్ నుంచి రెవిన్యూ వస్తోంది. గతంలో 100రోజులు 150రోజులు ధియేటర్స్‌లో సినిమా ప్రదర్శనలు జగరడం లేదు. సినిమా టాక్ బాగుంటేనే పెట్టిన పెట్టుబడి వచ్చేది. లేదంటే అంతే సంగతులు, దీనికి తోడు పైరసీ బెడద ఉండనే ఉంది.
30 రోజుల్లోనే
కొత్త సినిమా విడుదలైన 20 నుంచి 30 రోజుల్లోనే కొత్త సినిమాలను చూసే అవకాశం నెట్‌ఫ్లెక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెక్ట్స్, వూట్ తదితర ఓటీటీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా అవకాశం లభిస్తోంది. ఈ ఓటీటీ కంపెనీలు నెలరోజులు, ఏడాది ప్యాకేజీల వంతున ప్రేక్షకులకు చందాదారులగా చేర్చుకుంటున్నాయి. ఒక సినిమాని థియేటర్‌కి వెళ్లి కుటుంబ సమేతంగా చూసే ఖర్చుతో అత్యంత ఖరీదైన పాపులర్ ఓటీటీకి సంవత్సర చందా కట్టేయ్యోచ్చు. కొత్త సినిమాలతో పాటు వందలాది ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఓటీటీకి తోడు ఇంటర్‌నెట్ కనెక‌్షన్ తప్ప మరో భారం ఉండనే ఉండదు.
అమెజాన్ స్టిక్‌తో...
ఇటీవల ప్రతీ ఇంటిలో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. కొన్ని టీవీ కంపెనీలు నెట్‌ఫ్లెక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీమూవీస్, సన్‌నెక్ట్స్, వూట్ తదితర యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్‌గా అందిస్తున్నాయి. ప్రీ ఇన్‌స్టాల్ లేని వాళ్లకు ఫైర్‌స్టిక్ పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌ని అందిస్తోంది. ప్లగ్ అండ్ ప్లే తరహాలో ఫైర్ స్టిక్‌తో సినిమాలు చూసేయొచ్చు.
టీవీతో కూడా పోటీ
అమేజాన్ ప్రైమ్. నెట్‌ఫ్లెక్స్, హాట్‌స్టార్ తదితర ఓటీటీలలో సినిమా కంటెంట్ తో పాటు ఒరిజనల్ కంటెంట్ కూడా లభిస్తుంది. వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, సినిమాలను ఈ ఓటీటీలే నిర్మించి నేరుగా ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరోవైపు జీ , సోనీ, స్టార్ చానల్స్, సన్‌నెట్‌వర్క్ వంటి టీవీ ఛానల్స్‌కి అనుబంధంగా ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో టీవీలో కంటే ముందే సీరియల్స్‌ని ఓటీటీలో అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో ఓటీటీటీ ఛానల్స్ సినిమా థియేటర్లకే కాదు టీవీ ఛానల్స్‌కి సైతం పోటీగా మారాయి.
చదవండి : నెట్‌ఫ్లిక్స్‌పై ప్రశంసలను కురిపించిన అమెజాన్ అధినేత..! యూజర్లు షాక్..!
Comments
Please login to add a commentAdd a comment