వినోదం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. 50 ఏళ్ల క్రితం కొత్త సినిమా కోసం జిల్లా కేంద్రానికి వెళ్లి మరీ చూసేవారు. ఎందుకంటే అప్పట్లో మండలాల్లో కూడా సినిమాలు విడుదలయ్యేవి కావు. ఆ తర్వాత మండల కేంద్రాలకూ చేరాయి. ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయిన 30 రోజులకే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇంట్లోనే కూర్చొని సినిమా చూస్తున్నారు. కొందరు థియేటర్ అనుభూతి పొందేందుకు హోమ్ థియేటర్ల(హోమ్ సినిమా సెగ్మెంట్)ను ఏర్పాటు చేసుకుంటున్నారు. పెద్ద, పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు జిల్లాకు విస్తరించింది.
కర్నూలు: సగటు ప్రేక్షకుడికి సినిమా ఒక ప్రధాన వినోద సాధనం. తెలుగు చిత్రసీమలో 80 ఏళ్లకు పైగా ఇది రాజ్యమేలుతోంది. పండుగలు, పర్వదినాల్లో నిర్మాతలు స్టార్‌హీరోల సినిమాలు విడుదల చేసి భారీగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించుకుని కలెక్షన్లు కొల్లగొడుతారు. సినిమా ఏదైనా బాగుందంటే ప్రతి రోజు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం. ఈ సందడి 100, 175, 365 రోజుల పాటు ఉండేది. ఇదంతా ఒకప్పటి కథ. కోవిడ్–19 వైరస్ సినిమా కథనూ మార్చేసింది. కోవిడ్‌కు ముందు కోవిడ్ తర్వాత అనే విధంగా మార్చేసింది.
కోవిడ్ సమయంలో థియేటర్లు బంద్ చేసిన నేపథ్యంలో చాలా సినిమాలు థియేటర్‌లో గాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అంతకుముందు కూడా ఓటీటీ సంస్కృతి ఉన్నా కోవిడ్ సమయంలో దీనికి ఆదరణ బాగా పెరిగింది. ఇంట్లోనే టీవీలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా సినిమాలు వీక్షించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. ప్రస్తుతం సినిమా ఎంత బాగున్నా ఒకేసారి ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు వేస్తుండటంతో 30 రోజులకు మించి ఆడటం లేదు. ఈ క్రమంలో 30 రోజుల తర్వాత ఓటీటీలోనూ ఆ సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందేందుకు ఔత్సాహికులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇంట్లోనే హోమ్ థియేటర్‌తో మజా !
ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చాక మనం కోరుకున్న సినిమాను ఇంట్లోనూ కూర్చున్న చోట ఆన్‌లైన్‌లో నొక్కి చూడవచ్చనే అభిప్రాయం సగటు ప్రేక్షకులకు వచ్చింది. దీంతో పైస్థాయి మధ్యతరగతి, ఉన్నతస్థాయి ప్రజలందరూ వారి ఇంట్లో హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఈ కల్చర్ కనిపించేది. ఇప్పుడు క్రమంగా జిల్లాకు పాకింది. కాస్త పెద్ద ఇళ్లు ఉన్న వారు హోమ్ థియేటర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక హోమ్ థియేటర్ ఏర్పాటు కావాలంటే రూ.5 లక్షలు ఉంటే చాలు. ఆ పై థియేటర్ గదిని, సౌండ్ సిస్టమ్, స్క్రీన్, కుర్చీల సంఖ్యను బట్టి రూ.35 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు.
ఇందు కోసం వీటిని ఏర్పాటు చేసే నిర్వాహకులు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవారు. డెమో కూడా అక్కడే చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే డెమో థియేటర్లు ఏర్పాటు చేశారు. దీనికితోడు ఎవ్వరైనా స్నేహితులు, బంధువులు హోమ్ థియేటర్ చేయించుకుని ఉంటే వారిని చూసి మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని వాకబు చేసి మరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. డోన్ సమీపంలోని గ్రామంలో ఓ భూస్వామి తనకూ హోమ్‌థియేటర్ కావాలని పట్టుబట్టి అక్కడ సెల్‌ఫోన్ టవర్ లేకపోయినా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటయ్యేలోగా నిర్వాహకులతో మాట్లాడి సెల్‌టవర్‌ను ఇంటి వద్ద ఏర్పాటు చేయించుకున్నాడంటే హోమ్‌థియేటర్‌పై ఉన్న మక్కువ అర్థం అవుతుంది.
మంచి టీవీ ధరలోనే హోమ్ థియేటర్
అన్ని రకాల ఫీచర్లు, సౌండ్ సిస్టమ్‌తో ఉన్న బ్రాండెడ్ టీవీని కొనుగోలు చేయాలంటే రూ.2.5 లక్షలకు పైగానే వెచ్చించాలి. ఇలాంటి పెద్దతెర ఉన్న టీవీని తెచ్చుకుని చూడాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దీనికి రెండింతలు మొత్తం ఖర్చు పెడితే ఏకంగా ఇంట్లోనే సినిమా థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చన్న అభిప్రాయానికి చాలా మంది వస్తున్నారు. సొంత ఇల్లు ఉండి థియేటర్ ఏర్పాటు చేసుకునే స్థలం ఉన్న చాలా మంది ఇప్పుడు హోమ్ థియేటర్‌వైపు మక్కువ చూపుతున్నారు.
ఇందుకోసం రూ.5లక్షల నుంచి రూ.35 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. హోమ్‌థియేటర్ ఏర్పాటు కావాలంటే కనీసం 11/22 నుంచి 22/44 వరకు విస్తీర్ణంలో ఉన్న హాలులో 7.1 నుంచి 17.4 ఛానల్స్ వరకు స్పీకర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఆరుగురు నుంచి 20 మంది దాకా కూర్చుని సినిమా చూసే సామర్థ్యం ఉంటోంది. అన్ని భాషల్లో రూపొందిన సినిమాలు, వెబ్‌సిరీస్ ఓటీటీలో చూసే అవకాశం ఉండటంతో హోమ్ థియేటర్‌కు ఆదరణ పెరుగుతోంది. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్ లాంటి ప్రాంతాల్లో దాదాపు 250 ఇళ్లలో హోమ్‌థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment