సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వచ్చిన చంద్రబాబు తన హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్నట్లు కొత్త పల్లవి అందుకోవడంపై రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో వేమూరు నియోజకవర్గం అమర్తలూరు వచ్చిన చంద్రబాబు పెదపూడి, కూచిపూడి ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావిత పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి చీకటి పడింది. ఆ తరువాత ఆయన చెరుకుపల్లి, నగరం ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం బాపట్ల నియోజకవర్గంలోని అమర్తలూరు, కర్లపాలెం గుండా రాత్రి 11.30 గంటలకు బాపట్ల చేరుకున్నారు.
చంద్రబాబు పర్యటన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించినట్లు లేదు. పర్యటన మొత్తం రాత్రి పూట చీకట్లో రోడ్‌షోలా సాగింది. పర్యటన ఆసాంతం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వై.ఎస్.జగన్‌పై పనిగట్టుకుని విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. తన హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, తుఫాన్‌లను సమర్థంగా ఎదుర్కొన్నానని, పంటల బీమాతోపాటు, అన్నిరకాల సహాయాలను అందించానని అబద్ధాలు వల్లెవేశారు.
రైతు వ్యతిరేకిగా ముద్రపడిన బాబు ఇప్పుడు రైతులపై ప్రేమ వలకబోస్తూ మాట్లాడిన మాటలు విని రైతులు, ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తన హయాంలో రైతులకు పరిహారం ఎక్కువ ఇచ్చానని, జగన్ వచ్చాక దాన్ని తగ్గించారని బాబు విమర్శలు చేయడం చూసి రైతులు మండి పడుతున్నారు. తిరిగి తనకు అధికారం అప్పగిస్తే రైతులకు ఇచ్చే ఇన్సూరెన్సు, ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు, అన్నిరకాల పథకాలకు సంబంధించిన పరిహారాలను రెండు నుంచి మూడింతలు పెంచుతానంటూ బాబు పదే పదే చెప్పారు. ఓట్ల కోసమే చంద్రబాబు రైతులను వంచించే ప్రయత్నం చేశారు.
ఇది విన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనాడూ రైతుల గోడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఓట్ల కోసం రైతులపై ప్రేమను వలకబోస్తున్నారని విమర్శిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసమే బాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రభుత్వానికి పరిహారం విషయంలో సూచన చేయాల్సిన చంద్రబాబు అది చేయకుండా రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే పెద్ద మొత్తంలో పరిహారం ఇస్తానంటూ ఓట్ల రాజకీయానికి తెరలేపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి: దొంగ ఓట్లన్నీ ఆ పార్టీ తమ్ముళ్లవే..
Comments
Please login to add a commentAdd a comment