కరుడు కట్టిన ‘ఖాకీవనం’లోకి అడుగుపెట్టడానికి చాలా మంది యువకులు వెనకడుగు వేస్తారు. కేసులు, కోర్టులు, నేరస్తులతో బెంబేలెత్తిపోతారు. అయితే, ఆత్మవిశ్వాసమే వెన్నుదన్నుగా, అకుంఠిత దీక్షతో భానుప్రసన్న ధైర్యంగా అడుగుపెడుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ర్యాంకు సాధించి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరాలన్న చిన్ననాటి కలను సాకారం చేసుకుంది.
మార్టూరు: ‘ఆడపిల్లవు నీవు ఎస్‌ఐ అవుతావా ? ఎందుకమ్మా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోక ! ’ అంటూ అయిన వారి హేళన మాటల్ని ఆమె చాలెంజ్‌గా తీసుకుంది. అనుకున్నది సాధించింది. విజయానికి అడ్డదారులు, దొడ్డిదారులు ఉండవని నిరూపించింది. అకుంఠిత దీక్ష, పట్టుదలలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచింది బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన శివరాత్రి భాను ప్రసన్న. స్థానిక బీసీ కాలనీకి చెందిన శివరాత్రి శ్రీనివాసరావు, గంగమ్మ దంపతులు తమకున్న ఒకటిన్నర ఎకరా వ్యవసాయ భూమి సాగు చేసుకుంటూ చిన్నపాటి బడ్డీ కొట్టును నడుపుకుంటున్నారు.
ఇద్దరు కుమార్తెలను చదివించుకున్నారు. పెద్ద కుమార్తె భాను ప్రసన్న జొన్నతాళి గ్రామంలోని ప్రభుత్వ యూపీ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, మార్టూరు కాకతీయ విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తరువాత నర్సరావుపేట కృష్ణవేణి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నిమిత్తం చేరింది. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాలనే చిన్ననాటి కల సాకారం కోసం ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. బీటెక్ పూర్తి చేశాక లక్ష్యాన్ని మరింత విస్తృత పరచుకుంది. ఎస్‌ఐ కావాలనే తలంపుతో ప్రయత్నాలు ప్రారంభించింది.
పెళ్లి తన కెరీర్‌కు అడ్డంకిగా మారకూడదని భావించి తల్లిదండ్రులను ఒప్పించింది. చెల్లెలు కోమలికి ముందుగా వివాహం జరిపించింది భాను ప్రసన్న. మగరాయుడులా ప్యాంటు, టీషర్టు వేసుకుని పోలీసు అవుతుందంటా అనే ఇరుగు పొరుగు వారి మాటల్ని ఆమె పట్టించుకోలేదు. కూతురుకు బాసటగా శ్రీనివాసరావు నిలిచాడు. ఆయన నమ్మకం, పట్టుదలను సాకారం చేస్తూ భానుప్రసన్న మొక్కవోని దీక్షతో ఎస్‌ఐ పోటీ పరీక్షలో విజయం సాధించింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెరుగైన ర్యాంకుతో ఉద్యోగం సాధించి తానేమిటో నిరూపించుకుంది. తమ గ్రామానికి చెందిన ఓ యువతి ఎస్‌ఐగా ఎంపిక కావడంపై గ్రామస్తులంతా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తుడడం విశేషం.
ఎస్‌ఐతో సరిపెట్టుకోను
ఓ పల్లెటూరుకు చెందిన నేను ఎస్‌ఐగా ఎంపికయ్యే దాకా జరిగిన ప్రయాణంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఈ తరం ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ ఉండబోదని ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్నా. నిజాయతీ కలిగిన పోలీసు అధికారిగా పని చేస్తూ మహిళలు ఎదుర్కొనే సమస్యల నుంచి వారికి అండగా ఉంటా. వృత్తిపరంగా మరింతగా ఎదగడం కోసం ప్రస్తుతం కాకినాడలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. నా వెనుక సూటిపోటి మాటలు అన్నవారే నేడు అభినందిస్తుంటే ప్రస్తుతం నాకు ఎంతో అనందంగా ఉంది. నా గ్రామానికీ, నా కుటుంబానికీ మంచి పేరు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా.
– భాను ప్రసన్న
Comments
Please login to add a commentAdd a comment