
ఆగమ శాస్త్రాలలో ‘వైఖానస’ శ్రేష్టం
తెనాలి: ఆగమ శాస్త్రాల్లో వైఖానస ఆగమ శాస్త్రం శ్రేష్టమైనదని తిరుమల తిరుపతి దేవస్థానాల శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి అధ్యాపకుడు దీవి ఫణికుమార్ అన్నారు. శ్రీ వైఖానస సేవా సంఘం, తెనాలి ఆధ్వర్యంలో విఖనస జయంతి రోజైన సోమవారం పట్టణంలోని గోవర్ధనస్వామి దేవస్థానంలో కొలువైన విఖనసాచార్య స్వామి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన పంచామృత స్నపన, విశేష అర్చన జరిపి బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీవేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటైన సభకు సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఫణికుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, నైమిశారణ్యంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువే విఖనస మహామునిగా ఉద్భవించారని తెలిపారు. ఆయన ప్రధానమైన తొమ్మిది మంది రుషుల ద్వారా ఆగమ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారని చెప్పారు. వైదిక మార్గంలో భగవంతుని చేరవచ్చు అనేందుకు భగవదర్చన క్రియను కూడా అందించిన మహర్షి విఖనసుడని వివరించారు. సభాధ్యక్షుడు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ వైఖానస ఆగమ శాస్త్రాన్ని, వికనస మహాముని విశిష్టతను దశదిశలా వ్యాపింప చేసేందుకు వైఖానసులు కృషి చేయాలని సూచించారు. సేవాసంఘం నిర్వహిస్తున్న దార్మిక, సేవలను వివరించారు. సంఘ గౌరవాధ్యక్షుడు దీవి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన కార్యదర్శి మాధవ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.రఘు, కోశాధికారి యోగానంద చక్రవర్తి, పండిత వీఎల్‌ఎన్‌డీ భట్టాచార్యులు, నారాయణం రంగాచార్యులు, నారాయణం వేణుగోపాల్, ఆలయ కార్యనిర్వహణ అధికారిణి ఎన్‌వీఎన్ మల్లేశ్వరి, టీటీడీ భజన మండలి కన్వీనర్ రొంపిచర్ల కిరణ్‌కుమార్ మాట్లాడారు. దివి అంజనీకుమార్, వేదాంతం నాగమారుతి వేద పారాయణ చేశారు
టీటీడీ ఆగమ అధ్యాపకుడు ఫణికుమార్
ఆగమ ప్రజ్ఞా విశారద బిరుదు ప్రదానం
సేవాసంఘం ఆధ్వర్యంలో పండిత దీవి ఫణికుమార్ కు ఆగమ ప్రజ్ఞా విశారద బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని అగ్నిహోత్రం సనత్ కుమార్, అగ్నిహోత్రం శ్రీనివాస దీక్షితులు, రొంపిచర్ల శేషసాయి పర్యవేక్షించారు. రొంపిచర్ల లక్ష్మీనరసింహాచార్యులు, రాజ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుడు అగ్నిహోత్రం నరసింహమూర్తిని అర్చక పురస్కారంతో సన్మానించారు. ఆగమ విద్యార్థులు నారాయణం సంతోష్, వేదాంతం కమ లేష్‌కు ఆగమ విద్యార్థి పురస్కారాన్ని అందించారు. నారాయణం రంగాచార్యులు పర్యవేక్షణలో ఆచార్య స్వామి రథోత్సవం నిర్వహించారు.