జ్వరం వస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోండి
ఫ్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా వైద్యాధికారి
రాజుపాలెం: జ్వరం వచ్చి రెండు, మూడురోజులైనా తగ్గకుంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి తెలిపారు. మండలంలోని చౌటపాపాయపాలెం, కొత్తబోధనం గ్రామాలలో ఫ్రై డే–డ్రై డే కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటా జ్వరాల సర్వే జాగ్రత్తగా చేయడం వల్ల సీజనల్‌గా వ్యాధులైన డయేరియా, డెంగీ, మలేరియా రాకుండా కాపాడుకోవచ్చునని సిబ్బందికి సూచించారు. సీజనల్‌గా వచ్చే వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ఇళ్లల్లో పాత టైర్లు, కొబ్బరి బొండాలను తొలగించాలని, కూలర్స్‌లో నీటిని వారానికొకసారి మార్చుకోవాలని సూచించారు. దోమలను పారదోలడం వల్ల డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోద వ్యాధి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఇంటి పరిసరాలలోని సైడు కాలువల్లో వారానికొకసారి కిరోసిన్, బ్లీచింగ్ చల్లుకోవాలని సూచించారు . వర్షాకాలంలో అతిసార వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా డెప్యూటీ డీఎంహెచ్‌ఓ హనుమకుమార్, జిల్లా మలేరియా అధికారి రవీంద్రరత్నాకర్, సబ్ యూనిట్ అధికారి చంద్రశేఖర్, ఆరోగ్య పర్యవేక్షకులు జీవన్‌రావు, ఉషారాణి, కమ్యూనిటీ హెల్త్ అధికారి హన్నాకుమారి, ఏఎన్‌ఎం ప్రమీలాబాయి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment