అగ్ని ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రేకుల ఇల్లు దగ్ధం
నిద్రలోనే మృత్యు ఒడికి
ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
సకాలంలో స్పందించని ఫైర్ సిబ్బంది
ఘటన జరిగిన రెండు గంటల తర్వాత చేరుకున్న వైనం
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిన వైనం
పర్చూరు (చినగంజాం): ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో పెనువిషాదం నింపింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అక్కాచెళ్లెల్ల ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో నియోజకవర్గ కేంద్రం పర్చూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. పర్చూరు గ్రామంలోని రామాలయం వీధిలో దాసరి వెంకటేశ్వర్లుకు చెందిన రేకుల షెడ్డు ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పురవ్వలు చెలరేగి ఇంట్లోని దుస్తులు, వస్తువులకు, గ్యాస్ సిలిండర్‌కు నిప్పంటుకొని సోమవారం అర్ధరాత్రి గం.1.30 సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఊహించని ఘటనతో అనారోగ్యంతో ఉన్న ఇద్దరు ఆడబిడ్డలు దాసరి నాగమణి (34), దాసరి మాధవీలత (23) మంటల్లో కాలి మృతిచెందడం, వారిని రక్షించుకునే ప్రయత్నంలో తల్లి లక్ష్మీరాజ్యం తీవ్రగాయాలపాలై ఆస్పత్రి పాలవడం పర్చూరు వాసులను కంటతడి పెట్టించింది. నాగమణి పక్షవాతంతో మంచానికే పరిమితమవగా, మాధవీలత ఫిట్స్ వ్యాధితో బాధపడుతోంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అర్ధరాత్రి మృత్యువు కబళించడాన్ని తలుచుకొని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్‌వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ప్రమాద ఘటన తెలిసి ఇంటికి చేరుకున్న తండ్రి వెంకటేశ్వర్లు గుండెలవిసేలా విలపించడం చూపరులను కలచివేసింది.
ఘటనా స్థలాన్ని సందర్శించిన చీరాల డీఎస్పీ..
ఘటనా ప్రాంతాన్ని చీరాల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం, విద్యుత్ మీటరు కన్పించకుండా ఉండటంతో ఆయన విద్యుత్ శాఖ ఏడీఈ రమేష్‌ని పిలిపించి పరిశీలించాలని, పూర్తి విచారణ చేయాల్సిందిగా కోరారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. లేక దోమల కాయిల్ వలన నిప్పంటుకొని ప్రమాదం సంభవించిందా అనేది క్లూస్ టీంని రప్పించి విచారణ చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఆయన వెంట పర్చూరు ఇన్‌చార్జ్ ఎస్‌ఐ డి.రత్నకుమారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి
ఆదివారం అర్ధరాత్రి 1.15 నిమిషాల నుంచి 1.30 నిమిషాల్లోపు మంటలు చెలరేగాయి. ఆ సమయంలో చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దాదాపు 45 నిమిషాల పాటు వారు కనీసం ఫోన్ కూడా ఎత్తే పరిస్థితిలో లేరని తెలిసింది. అటు తరువాత సమాచారం అందుకున్న సిబ్బంది వేకువజామున 3.25 నిమిషాలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపులోనే ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లకు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున లేవడంతో తో అగ్నికి ఆహుతవుతున్న మహిళలను కాపాడే సాహసాన్ని స్థానికులు చేయలేకపోయారు. స్థానికంగా నీటిని తెచ్చి పోసే ప్రయత్నం జరిగినా అవి సరిపోలేదు. అర్ధరాత్రి కావడంతో అక్కడికి ప్రజలు ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది రాలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి ఉంటే ఇద్దరిలో ఒకరినైనా కాపాడుకొనే వారమని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment