పొలాల్లో రహదారి నిర్మిస్తే అడ్డుకుంటాం
జె.పంగులూరు: ‘మా పొలాల్లో రోడ్డు వేస్తే ఊరుకోం. వేరేవారి స్వలాభం కోసం మా పొలాలను పోగొట్టుకోలేం. ఈ విషయంలో ఎంత దూరం అయినా వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ పంగులూరు తహసీల్దార్ పి.సింగారావుకు తూర్పు కొప్పెరపాడు దళిత రైతులు తేల్చి చెప్పారు. వారి భూముల కొలతలు శనివారం తీసుకుంటామని, దానికి సంబంధించి దళిత రైతులు హాజరు కావాలని తహసీల్దార్ రెండు రోజులు క్రితం నోటీసులు పంపారు. దీంతో రైతులు గురువారం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గతంలో దళితులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నందుకు సర్వే నెంబర్ 254లో 20 మందికి ఒక్కొక్కరికి సుమారు 30 నుంచి 40 సెంట్ల వరకు బంజరు భూమిని ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దళితులకు ఇచ్చిన ఏడు ఎకరాల 50 సెంట్ల భూమిలో నుంచి గత సంవత్సరం పంగులూరు గ్రామానికి చెందిన బాచిన రత్నకుమార్ అనే వ్యక్తి తన చేనుకి పెద్ద రోడ్డు వేసుకున్నాడని, విషయం తెలిసిన తాము వెంటనే అడ్డుకొని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులకు చెప్పామని తెలిపారు. రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించి ఆ భూమితో రత్న ప్రభాకర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చారన్నారు. అందులో రోడ్డు వేయడం సరి కాదని తెలిపారన్నారు. వెంటనే అతని ద్వారానే ఆ రోడ్డును పూడ్చి వేశారని చెప్పారు. కానీ ఏడాది తర్వత రరోడ్డు వేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడని, దీనిపై తహసీల్దార్ తమకు నోటీసులు పంపించారని తెలిపారు. తమ అనుమతి లేకుండా తమ భూముల నుంచి రోడ్డు వేసే హక్కు ఎవరికీ లేదని, చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు తెలిపారు. తహసీల్దార్ మారిన ప్రతి సారి తమ భూముల నుంచి దారి వేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు పంపిస్తున్నారన్నారు. అనంతరం సదరు భూమి వివరాను వీర్వోలు నూతలపాటి సుధాకర్, గ్రామ సర్వేయర్ నాయపాము ఎలీషాకు వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సింగారావు మాట్లాడుతూ శనివారం భూమిని పరిశీలిస్తానని, రైతులకు అన్యాయం జరగనివ్వనని హామీ ఇచ్చారు. సీపీఎం నాయకుడు రాయిణి వినోద్ బాబు, వేమూరి సునందబాబు, పాలపర్తి రాంబా బు, పాలపర్తి అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
తేల్చి చెప్పిన దళిత రైతులు
Comments
Please login to add a commentAdd a comment