దొంగ ఓట్లు వేయించిన అధికారపక్షం
కొల్లూరు: అధికార పక్షం తప్పొప్పులు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతిపక్షానికి స్వేచ్ఛ అవసరం అని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి అన్నారు. గురువారం కొల్లూరులో పీడీఎప్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు తరఫున ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు ఆమె వచ్చారు. టీడీపీ నాయకులు పోలింగ్ బూత్‌ల వద్ద వ్యవహరిస్తున్న తీరు చూసి మండిపడ్డారు. టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఏజెంట్లను బెదిరించి కూర్చోకుండా చేయడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లూరులో ఓ యువకుడు పీడీఎఫ్ అభ్యర్థికి ఏజెంట్‌గా ఉంటున్న విషయాన్ని తెలుసుకొని ఇసుక క్వారీలో పనిలేకుండా చేస్తామని బెదిరించారు. చుండూరు మండలంలో సైతం ఏజెంట్‌లుగా ఉన్న వారిని అడ్డుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పలు మండలాలతోపాటు, కొల్లూరులో సైతం టీడీపీ నాయకులు గుంపులుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని దొంగ ఓట్లు వేయించారన్నారు. పట్టభద్రులు, ఉద్యోగులపై సైతం టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే కాదు, అధికార పక్షానికే నష్టమన్నారు. బెదిరింపులకు పాల్పడటంపై ఆమె ధ్వజమెత్తారు. పట్టభద్రులకు సరైన స్వేచ్ఛ ఇవ్వకుండా టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగడం మంచి చర్యకాదన్నారు. ఆమె వెంట ప్రజాసంఘాల నాయకులు బి. సుబ్బారావు, బీఎల్‌కే ప్రసాద్ ఉన్నారు.
ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి
Comments
Please login to add a commentAdd a comment