భవనంపై నుంచి జారి పడిన కూలీలు
సత్తెనపల్లి: బిల్డింగ్ పై నుంచి జారిపడి ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలైన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని నాగన్న కుంటలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణంలోని నాగన్న కుంటలో మున్సిపల్ ఉద్యోగి మొహిద్దిన్ ఇంటిపై వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసేందుకు పట్టణంలోని బాణావత్ రాంబాబు నాయక్, ఖాజావలి అనే ఇద్దరు కూలీలను పని నిమిత్తం మాట్లాడుకున్నారు. వారు వాటర్ ట్యాంకు లాగేందుకు తాళ్లు కట్టగా, తాడు సరిపోకపోవడంతో అదనపు తాడు కట్టి పైకి లాగే క్రమంలో తాడు తెగిపోయింది. కార్మికులు ఒక్కసారిగా మూడు అంతస్థుల భవనం పై నుంచి జారిపడ్డారు. ఈ ఘటనలో బాణావత్ రాంబాబు నాయక్ నడుముకు తీవ్ర గాయాలు కాగా, ఖాజావలికి తలకు, తదితర చోట్ల గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అవ్వారు ప్రసాదరావు ఇలాంటి కూలీలకు అండగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు
భవనంపై నుంచి జారి పడిన కూలీలు
Comments
Please login to add a commentAdd a comment