ఓటమి భయంతోనే పీడీఎఫ్ వారిపై దాడులు
బాపట్ల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే పీడీఎఫ్ మద్దతుదారులపై టీడీపీ వారు దాడికి తెగబడ్డారని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బాపట్ల పట్టణంలో మున్సిపల్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు పీడీఎఫ్ కార్యకర్త ఎస్.అనిల్ కుమార్‌పై పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు దాడికి తెగబడ్డాడన్నారు. పట్టణ పోలీసుల సమక్షంలో ఈ దాడి జరిగిందని గంగయ్య ఆరోపించారు. స్టేషన్లో గొలపల శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద సీహెచ్ గంగయ్య మాట్లాడుతూ బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో అనిల్ కుమార్‌పై పదేపదే దాడులకు ప్రయత్నం జరిగిందన్నారు. తామేం చేసినా చెల్లుతుందని టీడీపీ నాయకులు అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. పెద్దల సభకు జరిగే ఎన్నికల్లో సైతం సాధారణ ఎన్నికల్లా దౌర్జన్యాలకు, డబ్బులు పంపిణీకి పూనుకొని అడ్డగోలుగా గెలవాలనే ఈ దాడులకు పూనుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ మజుందార్, వసంతరావు, కొండయ్య, నాగేశ్వరరావు, అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్‌కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్‌లో సాయంత్రం 4.15 గంటల సమయంలో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత గొలపల శ్రీనుతోపాటు మరికొందరు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. నిబంధనలకు విరుద్దంగా వారిని ఎలా లోపలికి అనుమతిస్తారని ఎస్‌ఐను ప్రశ్నించానని తెలిపారు. ఇంతలో ‘నువ్వు ఎవడవిరా ఇక్కడ మాట్లాడటానికి‘ అంటూ తనపై ఒక్కసారిగా దాడికి దిగారన్నారు. గొలపల శ్రీనుతోపాటు మరికొంతమంది దాడి చేశారని తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వెంట ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment