వైద్యం నిరాకరించిన ప్రభుత్వ డాక్టర్
చీరాల: తాను చెప్పిన చోట మందులు కొనలేదని ఓ ప్రభుత్వ డాక్టర్ వైద్యం చేయడానికి నిరాకరించారని, అతడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు చీరాల ఆర్డీఓకు గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి కుమార్తె టి.మల్లేశ్వరి తెలిపిన వివరాల మేరకు.. మరియమ్మపేటకు చెందిన గుంజి వెంకాయమ్మ అనే వృద్ధురాలు ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 19వ తేదీ రాత్రి చీరాల ఏరియా వైద్యశాలలో చేర్పించారు. ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న ఓ డాక్టర్.. చీరాల మసీదు సెంటర్‌లోని ప్రాణహిత మల్టీస్పెషాలిటి, క్యాన్సర్ హాస్పిటల్‌లో మందులు తెచ్చుకోవాలని రిఫర్ ( ఈ ఆస్పత్రులు సదరు డాక్టర్‌వి అని ఆరోపణలు ఉన్నాయి.) చేశారన్నారు. అయితే ఆ ఆస్పత్రుల్లో మందులకు బిల్లులు ఇవ్వాలని కోరగా దానికి వారు నిరాకరించడంతో తాము బయట మెడికల్ షాపులో తెచ్చి ఇచ్చామన్నారు. అందుకు డాక్టర్ కోపగించుకున్నారని ఆరోపించారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా రిపోర్టు ఫైల్ విసిరేశారన్నారు. తన కుటుంబ సభ్యులను ప్రభుత్వ హాస్పిటల్ నుంచి బయటకు పంపించారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన ఆస్పత్రుల్లోనే చేసిన పరీక్షల రిపోర్టులు ఇవ్వాలని కోరగా అడ్రస్ లేని ఆస్పత్రుల రిపోర్టులు ఇస్తున్నారన్నారు. మళ్లీ గట్టిగా ప్రశ్నిస్తే మిత్ర డయాగ్నోస్టిక్, డిజిటల్ ఎక్స్‌రేకి చెందిన రిపోర్టులు ఇచ్చారని తెలిపారు. సదరు డాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన బాధితులు
Comments
Please login to add a commentAdd a comment