కార్మికులపై సర్దుపోటు!
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికుల రేషనలైజేషన్ ప్రక్రియ ముగిసింది. వార్డులో ఎక్కువ ఉన్న కార్మికులను మిగతా చోట్ల సర్దుబాటు చేశారు. అయితే ఈ మార్పులో యూనియన్ నాయకులు కీలకంగా వ్యవహరించారు. తమ అనుకూలురుకు, మామూళ్లు ఇచ్చుకున్న వారికి వార్డుల్లో వారే కొనసాగేలాగా.. మామూళ్లు ఇవ్వనివారిని దూరంగా ఉన్న వార్డులకు మార్చారని వినికిడి. ఈ రేషనలైజేషన్‌పై పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
2011 జనాభాకు తగ్గట్టుగా కార్మికులు
2011 జనాభా లెక్కల ప్రకారం 7.50లక్షల జనాభాకు తగినట్లుగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, 2012లో 10 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దీంతో జనాభా మరింత పెరిగింది. ప్రస్తుతం నగరంలో సుమారు 11లక్షల పైబడి జనాభా ఉండగా, సుమారు 3 లక్షల దాకా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. నగరంలో ప్రస్తుతం 2011 జనాభాకు తగ్గట్లుగా 2వేల మందిలోపు మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో నగరంలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల చెత్త వచ్చేది. ప్రస్తుతం సుమారుగా 470 మెట్రిక్ టన్నులకు ఇది పెరిగింది. ఈ చెత్తను బయటకు తీసుకెళ్లేందుకు తక్కువ సంఖ్యలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
500 మంది అవసరం
స్వచ్ఛ భారత్‌లో భాగంగా జాతీయ నిబంధనల మేరకు 350 ఇళ్లకు ఒక పుష్‌కాట్, ముగ్గురు వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం ఇద్దరినే కేటాయించారు. ట్రాక్టర్‌కు నలుగురు నుంచి ఐదుగురు వర్కర్లు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరే ఉంటున్నారు. దీంతో కార్మికులపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం ఉన్న జనాభాకు 500 మంది కార్మికులను అదనంగా తీసుకుంటేనే తప్పా నగరం బాగుపడదని జీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి.
ఒక్కోక్కరి నుంచి
రూ.10–15 వేలు వసూలు ?
రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలుసుకున్న కొందరు యూనియన్ నాయకులు నిరసన చేపట్టారు. దీంతో ఈ ప్రక్రియను అధికారులు వారికే అప్పగించారు. మామూళ్లు ఇచ్చుకుంటే మీకు నచ్చిన వార్డుల్లో వేస్తామని, లేకపోతే దూరంగా వెళ్లాల్సి వస్తుందని కార్మికులను బెదిరించారు. కొంతమంది కార్మికులు యూనియన్ నాయకులకు రూ.10 నుంచి 15 వేల దాకా ఇచ్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్లు ఇచ్చుకోలేని వారు దూరం వార్డులకు వెళ్లారు. దీనిపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
జీఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల సర్దుబాటు యూనియన్ నాయకుల సిఫార్సుల మేరకే రేషనలైజేషన్! డబ్బులు ఇచ్చినవారికి దగ్గర వార్డులు! ఒక్కొక్కరి నుంచి రూ.10–15వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు రేషనలైజేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment