యుద్ధ ప్రాతిపదికన తొలగించాలి
పంటకాలువల్లోని చెత్తను
బాపట్ల: పంట కాలువల్లో వేసిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు వద్ద మేజర్ కాలువను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. దిగువ ప్రాంతంలో పదివేల ఎకరాలకు సాగునీరు వెళ్లాల్సి ఉండగా చెత్త వేయడంతో కాల్వ పూడిపోతుందన్నారు. తద్వారా పర్యావరణం దెబ్బతింటుందని, ప్రజలకు నష్టం వాటిల్లుతుంటే పట్టించుకోరా అంటూ అధికారులను ప్రశ్నించారు. డంపింగ్ యార్డు కోసం కేటాయించిన స్థలంలో చెత్త వేయనివ్వడం లేదని, కొందరు కోర్టులో కేసు వేశారని పంచాయతీ సెక్రటరీ, డిప్యూటీ తహసీల్దార్‌లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. డంపింగ్ యార్డ్ స్థలం లేక రహదారి పక్కనే ఉన్న కాలువలో వేయాల్సి వచ్చిందని తెలిపారు. సమీపంలోని శ్మశానవాటిక స్థలం, మిగిలిన ఖాళీ స్థలాలపై కలెక్టర్ ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన చెత్త తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తక్షణమే భూమి సర్వే చేసి 50 సెంట్లు భూమిని ఎస్‌డబ్ల్యూపీసీకి కేటాయించాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని, పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నారు. నూతనంగా కేటాయించే స్థలంలో చెత్త సంపద కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఇకనుంచి చెత్త బయట కనిపించకూడదని అన్నారు. పంట కాలువలను ఆక్రమించి చెత్త వేస్తూ పర్యావరణం దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలువల్లో చెత్త వేయరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు, పనుల మంజూరుపై అధికారికంగా ఉత్తర్వుల రాగానే గుర్రపు డెక్క వెంటనే తొలగించాలన్నారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జలవనరుల కాల్వల పర్యవేక్షణ ఈఈ మురళీకృష్ణ, ఆర్డీవో పి గ్లోరియా, ఆర్ అండ్ బీ డీఈ అరుణకుమారి తదితరులు ఉన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment