చెరుకుపల్లి: కావూరులోని గురుకుల బాలికల విద్యాలయంలో ప్రవేశం కోసం విద్యార్థినిల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల విద్యానిలయం కావూరు ప్రిన్సిపాల్ పి.నాగమణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి విద్యార్థినిలు 5వ తరగతిలో చేరేందుకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన బాలికలు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థినిలకు ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం విద్యానిలయంలో సంప్రదించాలని కోరారు.
వదినపై మరిది కత్తితో దాడి
ఆస్తి తగాదాలే హత్యాయత్నానికి కారణం
దగ్గుబాడు (కారంచేడు): కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఆస్తి తగాదాలు హత్యాయత్నానికి దారితీశాయి. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా బాధితురాలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై వీ వెంకట్రావు వివరాల మేరకు.. మండలంలోని దగ్గుబాడు గ్రామానికి చెందిన నాయుడు హనుమంతరావు, నాయుడు శ్రీరామమూర్తి అలియాస్ రాంబాబులు అన్నదమ్ములు. వీరి మధ్యన పొలానికి సంబంధించిన ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. గతంలో ఒకసారి నిందితుడు రాంబాబుపై కేసు నమోదైంది. ఈ క్రమంలో సోమవారం పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నం చేశారు. కానీ రాజీ కాలేదు. దీంతో కోపంలో ఉన్న రాంబాబు తన అన్న హనుమంతరావు భార్య (వదిన) విజయలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో విజయలక్ష్మి చేతికి, తలకు మరికొన్ని చోట్ల గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో సోమవారం అర్ధరాత్రి కేసు నమోదైంది. నిందితుడిగా ఉన్న రాంబాబును ఎస్సై మంగళవారం అరెస్ట్ చేసి పర్చూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ఆర్మీ జవానుపై కేసు
చీరాల: ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ తనకు పుట్టలేదని భార్యను వేధిస్తూ పుట్టింటికి పంపించివేయడంతో భార్య ఫిర్యాదు మేరకు ఈపూరుపాలెం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెదుళ్లపల్లికి చెందిన లక్ష్మారెడ్డి కావూరివారిపాలేనికి చెందిన కొచ్చెర్ల సుధారాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక చిన్న బాబు పుట్టాడు. అయితే మొదటి నుంచి భార్యను వదిలించుకోవాలని చూస్తున్న ఆర్మీ జవాను ఆ బిడ్డ తనకు పుట్టలేదని అనుమానించి ఆమె పుట్టింటి వద్ద వదిలేసి వెళ్లాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్మీ జవాను లక్ష్మారెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment