ఆధునిక సేంద్రియ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలి
డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి
బాపట్ల: జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలను ఆధునిక సేంద్రియ పద్ధతుల ద్వారా పండించడంలో రైతులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చిరుధాన్య దిగుబడిని సాధించేరీతిగా రైతులను చైతన్యవంతం చేయడానికి హైదరాబాదులోని జాతీయ చిరుధాన్యాల ఉత్పత్తి కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఎక్కువ పోషక విలువలు కలిగి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే చిరుధాన్యాల సాగు ఆధునిక సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు. సాగుపట్ల అవగాహన పెంపొందించేందుకు ఆసక్తి గల కొందరు రైతులను ఎంపిక చేసి ఆ సదస్సులో పాల్గొనేందుకు బాపట్ల వ్యవసాయ కళాశాల అవకాశం కల్పించిందన్నారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో ఈ ప్రాంత రైతులు పాల్గొని చిరుధాన్యాల పంటల ఉత్పత్తి, నాణ్యతపై అవగాహన పెంచుకొన్నారన్నారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, ఉత్పత్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడంలోని ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ సదస్సు దోహదపడిందన్నారు. వ్యవసాయ కళాశాల తరపున ప్రొఫెసర్ డాక్టర్ లాల్ అహమ్మద్ మొహమ్మద్ ఆధ్వర్యంలో డాక్టర్ జి.వినయ్‌కుమార్, డాక్టర్ ఎన్.కిరణ్‌కుమార్‌లు సదస్సులో పాల్గొన్నట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment