షూటింగ్ బాల్‌లో చింతాయపాలెం విద్యార్థికి బంగారు పతకం
చింతాయపాలెం(కర్లపాలెం): సౌత్ జోన్ నేషనల్ షూటింగ్ బాల్ పోటీలలో తమ పాఠశాల 9వ తరగతి విద్యార్థి పిట్లు చిన్నయ్యప్పరెడ్డి మెరుగైన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడని చింతాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం తోట వెంకటరాజు తెలిపారు. మంగళవారం పాఠశాలలో క్రీడాకారులైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. హెచ్‌ఎం వెంకటరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఎన్‌జి కాలేజీలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ నేషనల్స్ షూటింగ్ బాల్ పోటీలలో ఏపీ జట్టు తరపున జూనియర్స్ విభాగంలో చిన్నయ్యప్పరెడ్డి ఆడి బంగారు పతకం సాధించాడని తెలిపారు. 8వ తరగతి విద్యార్థిని యల్లావుల సలోమి అండర్ –14 బాలికల విభాగంలో విజయవాడలో జరిగిన ఫెన్సింగ్ పోటీలలో పాల్గొని తృతీయస్థానం సాధించిందని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.గోపీని ఉపాధ్యాయులు అభినందించారు.
మిర్చి యార్డులో
1,27,375 బస్తాల విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు మంగళవారం 1,25,574 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,27,375 బస్తాలు అమ్మకాలు జరిగాయి. ఈ సీజన్‌లో ఈ స్థాయిలో మిర్చి బస్తాలు రావడం ఇదే ప్రథమం. శని, ఆదివారాలు మార్కెట్ యార్డుకు సెలవు కావడంతో ఆదివారం రాత్రి నుంచే వాహనాల్లో మిర్చి బస్తాలను తీసుకురాగా యార్డు నిండిపోయింది. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,000 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 70,117 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment