సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
బాపట్ల: సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉత్పత్తులను మరింతగా పెంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. సేంద్రియ వ్యవసాయం వార్షిక ప్రణాళికపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగం లేకుండా పంటలు సాగు చేయాలని అన్నారు. సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తేనే ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించగలమన్నారు. హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల కొరతను పూర్తిగా అధిగమించడం సంతోషదాయకమన్నారు. 2025వ సంవత్సరంలో లక్షా 7 వేల 165 ఎకరాలలో సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేయాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించారు. 62 వేల 97 మంది రైతులను సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరంలో వరి, శనగ, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటల సాగు విస్తృతంగా వ్యాప్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 362 గ్రామ సంఘాలలో సమావేశాలు నిర్వహించి, మహిళ రైతులతో చర్చించాలన్నారు. ఈనెల 30వ తేదీలోగా ఖరీఫ్ పంటల సాగుపై గ్రామస్థాయిలో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లా స్థాయిలో నిర్దేశించిన లక్ష్యాలు చేరుకునేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. సేంద్రియ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామకృష్ణ, సేంద్రియ వ్యవసాయం ఏపీ సీఎన్‌ఎఫ్ డీపీఎం వాణిశ్రీ, మోహన్‌కుమార్, ఉద్యాన శాఖ ఏడీ జెన్నమ్మ, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఆర్‌డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లేబర్ సెస్ వసూలుకు చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణదారుల నుండి ఒక శాతం లేబర్ సెస్ వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ జిల్లా కార్మికుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1996 ప్రకారం ఒక శాతం లేబర్ సెస్ వసూలు చేయాలని అన్నారు. వసూలు చేసిన సెస్‌ను కార్మిక శాఖకు చలానా రూపంలో అందజేయాలన్నారు. సెస్ వసూలు చేసినా కార్మిక శాఖకు అందటం లేదని అన్నారు. 2 జూన్ 2014 నుండి మంజూరు చేసిన పనులకు సంబంధించి నివేదిక తయారు చేసి కార్మిక శాఖకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకటశివప్రసాద్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు, మైన్‌నింగ్ శాఖ ఏడీ రాజేష్, వ్యవసాయ మార్కెటింగ్ మేనేజర్ రమేష్, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
Comments
Please login to add a commentAdd a comment