మూడు పూరిళ్లు దగ్ధం
రూ.11లక్షల ఆస్తి నష్టం
నిజాంపట్నం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని నక్షత్రనగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోని మోపిదేవి శివనాగరాజు గృహంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న మరో రెండు పూరిళ్లకు మంటలు వ్యాపించి మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. సంఘటనా స్థలానికి రేపల్లె అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.11లక్షల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.
వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.1.75 లక్షల నష్టం
చీరాలఅర్బన్: ఈపురుపాలెంలో జరిగిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో రూ.1.75 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి చీరాల మండలం ఈపురుపాలెంలోని పాత ఇనుపసామాన్ల షాపులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక లక్షా 50 వేల రూపాయల విలువ గల సామగ్రి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాపు యజమాని సయ్యద్ అఫ్రీది నుంచి వివరాలు నమోదు చేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. గురువారం సాయంత్రం ఈపురుపాలెంలోని ఎస్‌బీఐ సమీపంలో ఓ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని సామాగ్రి దగ్ధమైంది. మంటలు చెలరేగడానికి కారణం తెలియరాలేదు. ఇంటి యజమాని చెరుకూరి నారాయణ నుంచి వివరాలను నమోదు చేశారు.
ఐదు హాస్పిటళ్లకు జరిమానాలు
నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చిన 77 ఫిర్యాదులపై కమిటీ సభ్యులు విచారించారు. అందులో డబ్బులు వసూలు చేసిన ఐదు హాస్పిటళ్లకు జరిమానా విధించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్యసేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ బి.రవి, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణ అధికారి డాక్టర్ బీవీ రంగారావు, డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్, డాక్టర్ విక్టర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment