
తెగుళ్ల ఘాటు.. రైతుకు చేటు
కారంచేడు: గతేడాది మిరపకు కొంత వరకు మంచి గిట్టుబాటు ఉంది. దీంతో ఈ ఏడాది మిరపను సాగు చేసేందుకు మరికొంత మంది రైతులు ముందుకొచ్చారు. అప్పుల బాధ నుండి గట్టెక్కవచ్చని ఆశించిన రైతన్నలకు ఈ ఏడాది మిరప నష్టాలే మిగిల్చేలా ఉంది. జిల్లాలో సుమారు 54 వేల హెక్టార్ల (1లక్షా 35 వేల ఎకరాలు)లో మిరప సాగు చేశారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో మిరప పంటకు ప్రధానంగా నల్లి తెగుళ్లు, బూడిద తెగులు, పండాకు, కొమ్మ ఎండు తెగుళ్లు వంటివి ఆశించాయి. వీటి వలన దిగుబడులు ఘోరంగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి వ్యవసాయాధికారులు, హార్టికల్చర్ అధికారుల సూచనల మేరకు మార్కెట్‌లో ఎన్ని రకాల నివారణ మందులున్నాయో వాటినన్నింటినీ పిచికారీ చేశామని వాపోతున్నారు.
పెరిగిన సాగు ఖర్చులు
గతేడాదితో పోల్చుకుంటే భూమి కౌలు నుంచి పంట చేతికందే వరకు అయిన సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. నీటి ఖర్చులు, కోతలకు మొత్తం ఎకరానికి రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు.
గణనీయంగా తగ్గిన దిగుబడులు
గతేడాదితో పోల్చుకుంటే మిరపలో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎకరానికి 15–20 క్వింటాళ్ల దిగుబడి వస్తే అందుకు తగ్గట్లుగానే క్వింటా బస్తా ధర రూ.17–18 వేల వరకు వచ్చింది. ఈ ఏడాది ఎకరానికి 5–15 బస్తాలకు మించి దిగుబడులు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం మార్కెట్ ధర కూడా రూ.12వేలు మాత్రమే ఉంది. అంటే సగటున ఎకరానికి రైతులు 15 బస్తాల దిగుబడి వస్తే కనీసం రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిట్టుబాటు ధరలపైనే ఆశలు..
గతేడాది ప్రభుత్వం మిరప పంటకు మంచి గిట్టుబాటు ధరలు కల్పించింది. గ్రామాల్లో వారు సాగు చేసిన చేల వద్దకు వచ్చిన వ్యాపారులు క్వింటాకు రూ.18000 వరకు ఇచ్చి కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఇప్పటికి రూ.12000కు మించి రావడం లేదు. ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు రూ.11,800 ప్రకటిస్తే, ఇక దళారులు, వ్యాపారులు ఎవరు వచ్చి కొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర రూ.18000కు పెంచితేనే వ్యాపారుల నుంచి పోటీ వస్తుందని, అప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు.
వాతావరణ మార్పులతోనే మిరపకు తెగుళ్లు దిగుబడులపై నీలినీడలు.. తల్లడిల్లుతున్న రైతన్న జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో మిరప సాగు ఎకరానికి రూ.1.2 లక్షలు నష్టం వచ్చే అవకాశం

తెగుళ్ల ఘాటు.. రైతుకు చేటు
Comments
Please login to add a commentAdd a comment