ఉత్తమ లక్ష్యాలతో ఉన్నత శిఖరాలకు..
రేపల్లె రూరల్: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను కలిగి తమ లక్ష్య సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రూ.8కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలు పొందటమే కాకుండా, స్వయంగా సైతం ఆయా రంగాలలో ఉపాధిని పొందవచ్చన్నారు. అన్నిరకాల హంగులతో నిర్మించిన సాంతికేక కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలోని శిలాఫలకాన్ని ఆవిష్కరించి కళాశాల భవంతిని ప్రారంభించారు. ఆయనతో పాటు సాంకేతిక విద్యాశాఖ జేడీ పద్మారావు, ఆర్‌జేడీ నిర్మల్‌కుమార్, ఈఈ భాస్కర్ బాబు, డీఈ రామమోహనరావు, ఆర్డీఓ నేలపు రామలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ కట్టా మంగ, కమిషనర్ సాంబశివరావు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లెలో పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనం ప్రారంభం
వైఎస్సార్ సీపీ హయాంలో పూర్తి
రేపల్లెలో సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో 2010 సంవత్సరం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో తాత్కాలిక భవంతిలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసింది. శాశ్వత భవనం లేకపోవటం, సరైన సౌకర్యాలు లేకపోవటంతో విద్యార్థులు అంతంత మాత్రపు సౌకర్యాలతోనే విద్యాభ్యాసం చేసేవారు. అయితే తదుపరి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల శాశ్వత భవనం ఏర్పాటును నీరుగార్చారు. దీంతో విద్యార్థులు, విద్యాసంఘాలు ఆగ్రహించి 2015 సంవత్సరంలో ఉద్యమాలు చేపట్టినప్పటికీ ఫలితం దక్కకపోవటంతో నిరాశ పడ్డారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల కోసం రూ.8కోట్లు నిధులు కేటాయించి ప్రత్యేక చొరవ చూపి భవంతిని పూర్తిచేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల తరువాత కళాశాలను ప్రారంభించింది. కళాశాల పనులు చురుగ్గా సాగటంతో పాటు అవసరమైన పూర్తి మౌలిక వసతులతో కళాశాలను ఏర్పాటుకు కారణమైన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment