మాటిచ్చారు...మరిచారు
కూటమి పాలకుల తీరుకు నిరసనగా నేడు యువత పోరు
అబద్ధాల విష వలయం చుట్టుముడితే.. ఆకాశానికి నిచ్చెన వేసి ఆశల పల్లకీలో ఊరేగిస్తే.. అరచేతిలో వైకుంఠం చూపి మంత్రదండంలా ఆడిస్తే నిజమని నమ్మిన సామాన్యుడు.. కాల‘కూటమి’ చక్రబంధనంలో చిక్కుకున్నాడు.. అది మాయాచట్రమని తెలుసుకునేలోపు నివురుగప్పిన మోసం నిలువునా ముంచేసింది. బంగారు భవితను అంధకారం చేసింది. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి అంటూ యువగళంలో పోసిన గరళం అంపశయ్యపైకి చేర్చింది. తల్లికి వందనం పేరిట ‘అమ్మఒడి’లో రేపిన మంట కార్చిచ్చులా చుట్టుముట్టింది. విద్యా దీవెనలు.. శాపాల శరాఘాతాలై నిలువెల్లా తాకాయి. ఫలితంగా దగా పడ్డ తెలుగుబిడ్డ ఆగ్రహజ్వాలతో గళమెత్తి గర్జిస్తున్నాడు. కూటమి సర్కారుపై కన్నెర్రజేసి ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నాడు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దళమై కదంతొక్కేందుకు సిద్ధపడ్డాడు.
వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది. జిల్లాలో 477 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుచేసి 5,247 ఉద్యోగాలు కల్పించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో వేలాది మందికి వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. 348 హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి 348 ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాలు కల్పించింది. ఇవికాకుండా హౌస్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచి వారి శ్రమను గుర్తించింది. ఇవి కాకుండా ఎంఎస్‌ఎంఈల ద్వారా జిల్లాలో 705 యూనిట్లు ఏర్పాటుచేసి వారికి రూ.110.69 కోట్ల మేర రాయితీలు కల్పించింది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘‘అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. ఉద్యాగాలు ఇవ్వడం ఆలస్యమైతే అప్పటివరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.. కళలకు రెక్కల పథకం ద్వారా రుణాలు ఇస్తాం.. ఎయిడెడ్ కళాశాలల్లో ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పునరుద్దరణ... కాలేజీలకే రుసుం చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్ చిక్కులు లేకుండా చేస్తాం.. జీవో 117 రద్దు... డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ.. ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం.. మెగా డీఎస్సీ’’... అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కురిపించిన వరాల జల్లు. ఆయన మాటలు నమ్మిన యువత ఓట్ల వర్షం కురిపించింది. చంద్రబాబు అధికారం చేపట్టారు. తీరా పది నెలలు గడిచింది. మెగా డీఎస్సీ ప్రకటన లేదు.. ఉద్యోగాల ప్రకటనలు లేవు... భృతి లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు... దీంతో విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. అయినా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువతకు అండగా నిలవాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరు బాటకు పిలుపునిచ్చారు. బుధవారం బాపట్లలో యువత పోరు సాగనున్నది.
విద్యార్థులకు ట్యాబ్‌లు...
జిల్లా వ్యాప్తంగా 14,582 మందికి రూ.53.95 కోట్లు ఖర్చుచేసి ట్యాబ్‌లు పంపిణీచేశారు. విద్యాభివృద్ధిలో భాగంగా జిల్లాలో 1433 పాఠశాలల పరిధిలో రూ.304 కోట్లు ఖర్చుచేసి 2046 పనులను పూర్తిచేశారు. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, కిచెన్ షెడ్లు, ఇంగ్లీషు ల్యాబ్, పెయింట్స్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించారు.
ఇంటికొక నిరుద్యోగి....
జిల్లాలో 459 గ్రామపంచాయతీల పరిధిలో 944 గ్రామాలు ఉండగా వాటి పరిధిలో 4,97,000 గృహాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇంటికొకరు అనుకున్నా జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా ఉద్యోగాలతోపాటు తక్షణ సాయంగా నిరుద్యోగ భృతిని ఆశిస్తున్నారు. ఇంటికొకరికి నిరుద్యోగ భృతి అనుకుంటే నెలకు రూ.149.10 కోట్ల చొప్పున చెల్లించాల్సి వుంది. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఉద్యోగాలు దక్కనివారికి నిరుద్యోగ భృతి ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇలా..
ఎన్నికల సమయంలో 20 లక్షలఉద్యోగాలు ఇస్తామన్న చంద్రబాబు పది నెలలైనా ఒక్క ప్రకటనా లేదు పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్– వసతి దీవెన బకాయిలు అటకెక్కుతున్న ఉన్నత చదువులు నెలకు రూ.3 వేలు భృతి మాట నీటిమూటే.. ఆందోళనలో విద్యార్థులు, యువత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
మాటిచ్చారు...మరిచారు
మాటిచ్చారు...మరిచారు
Comments
Please login to add a commentAdd a comment