ఏసీబీ వలలో పరిశ్రమల ప్రోత్సాహకాధికారి
రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
అద్దంకి: పీఎంఈజీపీ రుణం ఇప్పించేందుకు దరఖాస్తుదారుల నుంచి డిమాండ్ చేసిన నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బాపట్ల జిల్లా పరిశ్రమల ప్రోత్సాహకాధికారి(ఏపీవో)ను పట్టుకున్నారు. వివరాలు.. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వీర్ల రమేశ్‌బాబు తన గ్రామంలో డైరీ ఫాం పెట్టి వ్యాపారం చేసుకునేందుకు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం(పీఎంఈజీపీ)కోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అద్దంకికి చెందిన మరో వ్యక్తి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిరువురినీ జిల్లా కేంద్రం బాపట్ల డీఐసీలో ఐపీవోగా పనిచేసే తన్నీరు ఉమాశంకర్ ఒక్కో దరఖాస్తుకు రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దరఖాస్తుదారులకు ఆ లంచం అధికారికి ఇవ్వడం ఇష్టం లేక వారు గుంటూరులోని ఏసీబీ అధికారులను కలిసి రిపోర్టు చేశారు. ఆ అధికారి దరఖాస్తుదారులను మంగళవారం అద్దంకిలోని కేఅండ్‌కే కన్సల్‌టెన్సీ వద్ద రూ.40 వేలు మధ్యవర్తి అయిన కమ్మ కిశోర్‌బాబు అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా తీసుకుంటుండగా, పక్కా ప్లాన్‌తో వచ్చిన ఏసీబీ అధికారులు ఇరువురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారి మహేందర్ మాతే మాట్లాడుతూ అరెస్ట్ చేసిన ఇరువురిని బుధవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే సంబంధిత జిల్లా ఏసీబీ అఽధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఎవరైనా లంచం అడిగితే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు కాల్‌చేయాలని చెప్పారు.
రేపు ఎయిమ్స్‌లో వాక్‌థాన్
మంగళగిరి: నగర పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్) ఆవరణలో వాక్‌థాన్ నిర్వాహకులు వి.నేహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13న గురువారం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు వాక్‌థాన్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎయిమ్స్ ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో కిడ్నీ ప్రాముఖ్యంపై అవగాహన కల్పించనున్నట్టు వివరించారు.
యార్డులో 1,44,323 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,38,953 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,44,323 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 69,551 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
ఏసీబీ వలలో పరిశ్రమల ప్రోత్సాహకాధికారి
ఏసీబీ వలలో పరిశ్రమల ప్రోత్సాహకాధికారి
Comments
Please login to add a commentAdd a comment