గొలుసు లాక్కొని యువకుల పరారీ
నరసరావుపేట టౌన్: ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కొని వెళ్లిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌నగర్ 60 అడుగుల రోడ్డు సీబీఐటీ స్కూల్ సమీపంలో నలిశెట్టి సులోచన నడిచి వెళ్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలో బంగారు గొలుసును లాక్కొని పరారీ అయ్యారు. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంబడించినా ఫలితం దక్కలేదు. ఈ మేరకు బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిశోర్ తెలిపారు.
విశాఖపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం–చర్లపల్లి ప్రత్యేక రైలు (08579) ఈ నెల 16న సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08580) ఈ నెల 17న ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, అదే రోజు రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడకుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతుంది.