రేపల్లె రూరల్: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షురాలు నసీరున్నీసా బేగం కోరారు. పట్టణంలోని తన చాంబర్‌లో ఆదివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ముస్లింల హక్కులు, స్వేచ్ఛను కాలరాయటానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతూ వక్ఫ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతోందన్నారు. బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించటం బాధాకరమన్నారు. సమస్య ముస్లిం సమాజందే కాకుండా దేశ సమస్యగా ప్రతి ఒక్కరూ భావించి బిల్లు సవరణను అడ్డుకోవాలని ఆమె కోరారు. బిల్లు పార్లమెట్‌లో ఆమోదం పొందితే ముస్లింల భావితరం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులపై ప్రైవేటు సంస్థలకు, ప్రభుత్వాలకు ఎటువంటి అధికారం ఉండదని, ఆస్తులపై అధికారం చేజిక్కించుకోవాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. భవిష్యత్‌లో ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముస్లిం పెద్దలు వక్ఫ్ బోర్డు ద్వారా పలు ఆస్తులను ఏర్పరిచారని, వాటిని స్వాధీనం చేసుకోవాలన్న కుట్రతో బిల్లును తెరపైకి తెచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ బిల్లును వ్యతిరేకించాలని కోరారు.
బిల్లును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షురాలు నసీరున్నీసా బేగం