జెడ్పీటీసీలకు సముచిత గౌరవం లేదు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీలకు సముచిత గౌరవం లేదు

Mar 16 2025 1:55 AM | Updated on Mar 16 2025 1:54 AM

జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా నిధులు మంజూరు చేయడం తగదు

● కమీషన్లు, పర్సంటేజ్‌లు దండుకుంటున్నారు

వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా

పనిచేయడం సహించలేకున్నాం

మీడియా సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీలు

గుంటూరుఎడ్యుకేషన్‌: ప్రజల ఓట్లతో గెలిచిన తమ కు కనీస గౌరవం, సముచిత స్థానం కరువయ్యా యని వైఎస్సార్‌ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన జెడ్పీటీసీలు గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు

రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత జెడ్పీ ఎన్నికల్లో కత్తెర హెనీ క్రిస్టినాకు జెడ్పీటీసీగా గెలిపించడంతోపాటు చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీలోకి వెళ్లిన క్రిస్టినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతో ఆవేదనకు గురి చేశాయని చెప్పారు. ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలకు గౌరవం ఇవ్వకపోగా, ముందస్తు అనుమతుల పేరుతో జెడ్పీ చైర్‌పర్సన్‌ నేరుగా సంతకాలు చేసి పనులు మంజూరు చేస్తున్నారని అన్నారు. జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా, సర్వసభ్య సమావేశం దృష్టికి తీసుకురాకుండా పనులు మంజూరు చేస్తున్నప్పుడు ఇక తమకు విలువ ఎక్కడిదని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో కోట్లాది రూపాయల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇస్తూ, వాటిలో కమీషన్లు, పర్సంటేజీలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరగాల్సిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉండటంతోపాటు రూ.12 కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులను చైర్‌పర్సన్‌ ఇచ్చేశారని చెప్పారు. తామందరం సమావేశానికి వెళ్లి ఉంటే తమ అంగీకారం లేకున్నా, కోరం ఉందనే సాకుతో బడ్జెట్‌ను ఆమోదించడంతోపాటు సంబంధిత రూ.12 కోట్ల పనులను తమ అంగీకారం లేకుండా ఆమోదించుకునే వారని చెప్పారు. ప్రజాధనం వృథా కారాదనే ఉద్దేశంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన 42 మంది సభ్యులు సమావేశాన్ని బహిష్కరించినట్లు పేర్కొన్నారు. అసలు ముందస్తు అనుమతులు అనే మాట పంచాయతీరాజ్‌ చట్టంలోనే లేదన్నారు.

ఏకపక్షంగా కేటాయింపులు

ప్రత్తిపాడు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా జెడ్పీటీసీలకు తెలియకుండా ఏకపక్షంగా నిధులు మంజూరు చేస్తూ, జెడ్పీని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అత్యవసర పనుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా పనులు ఆమోదిస్తూ, కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు.

జెడ్పీటీసీలకు ప్రాధాన్యమెక్కడ?

కాకుమాను జెడ్పీటీసీ గుల్జాన్‌బేగం మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడంలో చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా జెడ్పీటీసీలకు ప్రాధాన్యం కల్పించడం లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన 56 మంది సభ్యులుగా తాము పార్టీని నమ్ముకుని ఉండగా, కొంత మంది రాజకీయ ప్రయోజనాలతో పార్టీని వీడారని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా తమ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉందని, జెడ్పీలో జరుగుతున్న కార్యకలాపాలు, నిధుల మంజూరుపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత చైర్‌పర్సన్‌కు ఉందన్నారు. పార్టీని వీడే ముందు జెడ్పీటీసీలుగా తమను సంప్రదిచకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు మినహా, ప్రజాప్రయోజనాలు లేవన్నారు. సమావేశంలో జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement