మార్టూరు: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిఠాపురంలో శుక్రవారం జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించటం ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు‘ అన్నట్లుందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన బాలినేని తీరుపై నిప్పులు చెరిగారు. బాలినేనికి రాజకీయ బిక్ష పెట్టిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిలను విమర్శించే అర్హత బాలినేనికి లేదని బాలినేని తీరు తల్లి పాలు తాగి ఆ తల్లి ఎదపై తన్నినట్లు ఉందని అన్నారు. తన చెల్లెలు భర్త అన్న ఒకే ఒక్క కారణం చేత నీ బావ వైవీ సుబ్బారెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి ఒంగోలు టికెట్ ఇప్పించటంతో నీ రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావడం నిజం కాదా? అదే సుబ్బారెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటూ జిల్లా రాజకీయాలలో జోక్యం చేసుకోనివ్వకుండా చేసిన నీవు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బత్తుల అన్నారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ నాశనానికి, మార్కాపురం జిల్లా కాకుండా అడ్డుకున్నది నీవు కాదా? అని ఆయన ప్రశ్నించారు? జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గంలో ఐదారుగరికి పార్టీ టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికి ప్రతి ఎన్నికను వ్యాపారంగా మార్చుకున్న నీవా వైఎస్ జగన్‌ను విమర్శించేది? అని అన్నారు. నీ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ అవినీతి అరాచకాలపై విచారణ చేయించాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు
బత్తుల బ్రహ్మానందరెడ్డి