మెడికల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలి
ధర్నాకు దిగిన జిల్లాలోని సీహెచ్‌వోలు
బాపట్లటౌన్: సిబ్బందిని వేధింపులకు గురిచేయడంతోపాటు మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి కారణమైన యద్దనపూడి మెడికల్ ఆఫీసర్ పమిడి శ్రీహర్షపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ జిల్లాలోని సీహెచ్‌వోలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్)లు సోమవారం డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం ఎదుట ధర్నాచేశారు. బాధితురాలు పసుపులేటి సరోజిని మాట్లాడుతూ యద్దనపూడి మండలం పెద జాగర్లమూడి గ్రామంలో మూడు సంవత్సరాలుగా సీహెచ్‌వోగా విధులు నిర్వర్తిస్తున్నానని, నేను మెటర్నిటీ లీవ్‌పై వెళ్లి తిరిగి జాయిన్ అయ్యానని తెలిపారు. అప్పటికే నా రికార్డులు, నా శాఖకు సంబంధించిన పరికరాలు లేవని, ఏమయ్యాయని ఆశా వర్కర్, ఏఎన్‌ఎంలను అడిగితే సరైన సమాధానం చెప్పలేదని తెలిపింది. రికార్డులు మొత్తం రాసుకున్నానని, రూ.20 వేలు ఖర్చుచేసి పరికరాలను కొనుగోలు చేశానని తెలిపింది. మరోసారి 9 నెలల తర్వాత మరలా రికార్డులు తారుమారుచేశారని, పరికరాలను మాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళితే ఆయన నొటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా ఎఫ్‌ఆర్‌ఎస్‌లో వేలిముద్ర కూడా వేయనియ్యకుండా మానసికంగా ఇబ్బందులకు గురిచేశారని తెలిపింది. మనస్తాపం చెందిన ఈనెల 8న గుంటూరులోని స్వర్ణాంధ్రనగర్‌లో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్న మెడికల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తూ జిల్లాలోని సీహెచ్‌వోలు, ఎంఎల్‌హెచ్‌పిలు ధర్నాచేశారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ధర్నా కొనసాగుతూనే ఉంది. డీఎంఅండ్‌హెచ్‌వో అందుబాటులో లేకపోవడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ధర్నాను కొనసాగిస్తామని సీహెచ్‌వోలు డిమాండ్ చేస్తున్నారు.