తెనాలి టౌన్: రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకులు ఎం.విజయసునీత పేర్కొన్నారు. మంగళవారం తెనాలి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. రూరల్ మండలం ఖాజీపేట, హాఫ్‌పేట పరిధిలో రైతులు వేసిన పెసర పంటను పరిశీలించారు. గిట్టుబాటు ధరను తెలుసుకున్నారు. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. దీంతో వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. కొల్లిపర మండలంలో అత్తోట గ్రామంలో పర్యటించి తెల్లజొన్నను పరిశీలించారు. క్వింటాకు రూ.2,200 ధర లభిస్తున్నట్లు రైతులు తెలియజేశారు. కొల్లిపరలో పసుపు రైతులతో మాట్లాడారు. క్వింటా రూ.8000 – రూ.11,000 మధ్య ఉందని రైతులు పేర్కొన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని ఆమె సూచించారు. మార్కెటింగ్ శాఖ విజయవాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కాకుమాను శ్రీనివాసరావు, గుంటూరు సహాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు డి.రాజాబాబు, తెనాలి, దుగ్గిరాల మార్కెట్‌యార్డు కార్యదర్శులు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ జె.కృష్ణారావు, జీడీసీఎంఎస్ గుంటూరు బిజినెస్ మేనేజర్ హరిగోపాల్ పాల్గొన్నారు.
అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రాష్ట్ర సంచాలకులు