
ఒడిశా టు ఆంధ్రా గంజాయి రవాణా
తాడేపల్లి రూరల్ : ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోందని రుజువైంది. తాజాగా గురువారం తాడేపల్లి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు వివరాలను నార్త్‌జోన్ డీఎస్పీ మురళీకృష్ణ విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ వద్ద కొందరు గంజాయి తాగుతున్నారన్న సమాచారం రావడంతో తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు, ఇతర సిబ్బంది నిఘా ఏర్పాటుచేసి గంజాయి తాగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నాలుగు కేజీల గంజాయి లభ్యమైంది. పాత ఈస్‌ఐ హాస్పిటల్ వద్ద వార్పునకు చెందిన పీతా దినేష్ కుమార్, పోలకంపాడుకు చెందిన కోడె సూర్యగణేష్, ఉండవల్లికి చెందిన మల్లిశెట్టి అనీల్, పెనుమాకకు కళ్ళం అనీల్‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు ఒడిశాలోని బరంపురంలో గంజాయి కొని అక్కడి నుంచి రైలు ద్వారా తాడేపల్లికి తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నట్టు నిర్ధారణైంది. ఈ నలుగురిలో పీతా దినేష్‌కుమార్‌పై కృష్ణాజిల్లాలో ఓ గంజాయి కేసు నమోదై ఉంది. మిగిలిన ముగ్గురు తొలిసారి పట్టుబడ్డారు. వీరు డబ్బులు అవసరమైనప్పుడు ద్విచక్రవాహనాలు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఒడిశా వెళ్లి గంజాయి కొని తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్ముతుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
గంజాయికి అలవాటు పడిన
అంతర్జాతీయ స్విమ్మర్
నిందితుల్లో మల్లిశెట్టి అనీల్ అంతర్జాతీయ స్విమ్మర్ అని, అతనూ గంజాయికి అలవాటు పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యాయామాలపై అవగాహన కలిగిన క్రీడాకారులూ వ్యసనాలకు అలవాటు పడడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కేసులో ప్రతిభకనబర్చిన తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ అభినందించారని డీఎస్పీ వెల్లడించారు.
తాడేపల్లి పోలీసులకు పట్టబడిన
నలుగురు యువకులు
నిందితుల్లో అంతర్జాతీయ స్విమ్మర్!

ఒడిశా టు ఆంధ్రా గంజాయి రవాణా