
రైతులు గిడ్డంగుల్లోనే నిల్వ చేసుకోవాలి
బాపట్ల: గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు పండించిన పంటలను గిడ్డుంగుల్లో నిల్వ చేసుకోవచ్చని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాపట్ల గిడ్డంగుల వద్ద రైతులు ధాన్యం నిల్వలపై శనివారం అవగాహన కల్పించారు. మేనేజర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గిడ్డుంగుల్లో ధాన్యం నిల్వ చేసి లాభాలు వచ్చినప్పుడు విక్రయించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ కళాశాల డీన్ డాక్టరు ప్రసూనారాణి మాట్లాడుతూ పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టరు కె.ఎస్.పాల్, హైమాజ్యోతి, కె.సునీల్, అపర్ణ, శీతా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో యడ్లపాడు మండలం వంకాయలపాడుకు చెందిన వ్యక్తి మృత్యువాత పడిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు.. మండలంలోని వంకాయలపాడుకు చెందిన లారీ డ్రైవర్ షేక్ మస్తాన్‌వలి(62) మూడు రోజుల కిందట వైజాగ్‌కు లోడు తీసుకుని వెళ్లాడు. వైజాగ్ నుంచి ఐరన్ లోడ్‌తో తిరుగు ప్రయాణంలో ఉన్న లారీ, శుక్రవారం అర్ధరాత్రి అనకాపల్లిలో మరో లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసం కాగా, మస్తాన్‌వలి నడిపే లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జ కావడంతో డ్రైవర్ సీట్లోనే ఇరక్కుపోయాడు. అక్కడిక్కడే మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితం భార్యను కోల్పోయిన మస్తాన్‌వలి, ఇద్దరు సంతానంలో ఒక కుమార్తె కూడా కొద్దికాలం కిందట మృతి చెందింది. ప్రస్తుతం మరో కుమార్తె, అల్లుడు వంకాయపాడు గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. డ్యూటీకి అని వెళ్లిన తన తండ్రి విగతజీవిగా మారాడన్న వార్త విన్న కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపించింది.
కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి
అచ్చంపేట: కృష్ణానదిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కోగంటివారిపాలెంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు మండలంలోని ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట జయరావు, సరోజినీల కుమారుడు రామ్‌కుమార్ (28) స్నేహితులతో కలసి శనివారం సాయంత్రం 5గంటల సమయంలో సమీపంలోని కృష్ణానదిలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే నది లోతుల్లో జారి పడిపోయినట్లు తెలిసింది. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు తెలుపుతున్నారు. రామ్‌కుమార్ ఇటీవల వైద్యునిగా అర్హత పొంది గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అసిస్టెంట్ వైద్యునిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. కుమారుడు అకస్మాతుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. పోలీసుస్టేషన్‌లో ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మేదరమెట్ల: గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల పైలాన్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. అద్దంకి దామవారిపాలేనికి చెందిన ఏలూరి ఆదినారాయణ (24) సొంత పని నిమిత్తం బైకుపై ఒంగోలు వెళ్లి తిరిగి అద్దంకి వస్తున్నాడు. మేదరమెట్ల పైలాన్ సమీపానికి రాగానే అద్దంకి వైపు వెళ్లేందుకు గాను సర్వీసు రోడ్డులోకి వచ్చే క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం బైకును బలంగా ఢీకొని వెళ్లిపోయింది. దీంతో బైకుపై ఉన్న ఆదినారాయణ రోడ్డుపై పడి పోయాడు. తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మోసం చేసి డబ్బుతో పరారైన నిందితుడి అరెస్ట్
●డబ్బు రికవరీ ●14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
●వివరాలు వెల్లడించిన సీఐ ప్రభాకరరావు
మాచర్ల: పొలం రిజిస్ట్రేషన్‌కు ఇవ్వాల్సిన డబ్బు తీసుకుని ఉడాయించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజు రిమాండ్ విధించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రభాకరరావు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ గ్రామానికి చెందిన బండెల నరసింహారెడ్డికి దుర్గి మండలంలోని, ముటుకూరు గ్రామ శివారులో 6.88 ఎకరాల పొలం ఉంది. దీన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా మాచర్ల టౌన్‌కు చెందిన చింతా శ్రీనివాసరావు పరిచయం అయ్యాడు. 2022లో పొలం అమ్మకం విషయంలో చిత్తూరు జిల్లాకు చెందిన మైలా మల్లేష్ యాదవ్, సదరు వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడు. నరసింహారెడ్డి తన పొలాన్ని దుర్గి మండలానికి చెందిన మాదాసు వెంకటేశ్వర్లుకు రూ.70.50 లక్షలకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అడ్వాన్సుగా రూ.45 లక్షలు మాదాసు వెంకటేశ్వర్లు, మల్లేష్ యాదవ్‌కి ఇచ్చారు. అందులో రూ.15 లక్షలు తన వద్ద పెట్టుకొని రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాతే ఇస్తాను అని మల్లేష్ యాదవ్ నమ్మించాడు. అది నమ్మి నరసింహారెడ్డి మార్చి 15న తన పొలంలో మాదాసు వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. నిందితుడి తన వద్ద ఉన్న ఫిర్యాదికి చెందిన రూ.15 లక్షలు, మాదాసు వెంకటేశ్వర్లు వద్ద నుంచి రావాల్సిన రూ.25.50 లక్షలు మొత్తం రూ.40.50 లక్షలు తీసుకొని రిజి స్ట్రేషన్ ఆఫీస్ నుంచి పారిపోయాడు. నిందితుడికి ఫిర్యాది ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించక పోవడంతో మోసపోయినట్లు గ్రహించి సదరు విషయం గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ పి.ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సంధ్యారాణి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి నిందితుడిని చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి నగదు రికవరీ చేసి మాచర్ల కోర్టులో హాజరు పరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

రైతులు గిడ్డంగుల్లోనే నిల్వ చేసుకోవాలి

రైతులు గిడ్డంగుల్లోనే నిల్వ చేసుకోవాలి

రైతులు గిడ్డంగుల్లోనే నిల్వ చేసుకోవాలి

రైతులు గిడ్డంగుల్లోనే నిల్వ చేసుకోవాలి